తెలంగాణాలో కరోనా @ 809 : మెడికల్ షాపుకు వెళుతున్నారా ?

తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న క్రమంలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2020, ఏప్రిల్ 18వ తేదీ శనివారం కొత్తగా 43 కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది.

దీంతో మొత్తం కేసులు 809కి చేరాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలో 31 కొత్త కేసులు నమోదయ్యా యి. జ్వరం, జలుబు, దగ్గు అంటూ మందుల కోసం నేరుగా మెడికల్ దుకాణానికి వెళితే..ఫోన్ నెంబర్, చిరునామాను తప్పనిసరిగా ఇవ్వాలని మున్సిపల్ శాఖ వెల్లడించింది.

హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల కోసం జీహెచ్‌ఎంసీ జల్లెడ పడుతోంది. ఇందులో భాగంగా మెడికల్‌ షాపుల యజమానులకు కీలక ఆదేశాలు జారీచేసింది. జ్వరం, దగ్గు, తలనొప్పి, జలుబు మందుల కోసం వచ్చేవారి వివరాలు తీసుకునేలా మెడికల్‌ షాప్‌ యజమానులకు ఆదేశించాలని, ఆ వివరాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అందించేలా వ్యవస్థను రూపొందించాలని మున్సిపల్ అధికారులకు సూచించింది. కరోనా లక్షణాలతో మెడికల్‌ షాప్‌కు వచ్చే వారికి…. కౌన్సిలింగ్‌ నిర్వహించేలా మెడికల్ షాపుల వారికి శిక్షణ ఇవ్వాలని అధికారులకు తెలిపింది.

గద్వాల జోగులాంబ జిల్లాలో 7, సిరిసిల్లలో 2, రంగారెడ్డిలో 2, నల్లగొండ జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 186 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్‌ అవగా… 18 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు 605 ఉన్నాయి.

రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా 13 జిల్లాలో 209 క్లస్టర్లలో 4 లక్షల 39 వేల 900 మందిని వైద్య సిబ్బంది సర్వే చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక ఢిల్లీలోని మర్కజ్ సమావేశంలో రోహింగ్యాలు కూడా పాల్గొన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడంతో తెలంగాణ సర్కార్ అలర్టయ్యింది. కేంద్రం హెచ్చరికలతో హైదరాబాద్ పరిధిలోని రోహింగ్యాల వివరాలను సేకరించే పనిలో పడింది.

మూడు కమిషనరేట్ పరిధిలో 6వేలకు పైగా రోహింగ్యాలున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో చాలామంది ఢిల్లీలోని నిజాముద్దీన్, హర్యానాలోని మేవాట్‌లో జరిగిన జమాత్‌లో పాల్గొన్నారు. దీంతో హైదరాబాద్ క్యాంపు నుంచి వెళ్లిన రోహింగ్యాల కుటుంబ సభ్యుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.