కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదైంది. లండన్ నుంచి వచ్చిన తన కొడుకుని క్వారంటైన్
కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదైంది. లండన్ నుంచి వచ్చిన తన కొడుకుని క్వారంటైన్ చేయకుండా బయటకు పంపినందుకు డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డీఎస్పీ కొడుకు ఇటీవలే లండన్ నుంచి వచ్చాడు. నిబంధనల ప్రకారం విదేశీ ప్రయాణ వివరాలను ప్రభుత్వానికి తెలపాలి. ఫారిన్ నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్ లో ఉంచాలి. 14 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంచాలి. అయితే డీఎస్పీ మాత్రం అలా చెయ్యలేదు. కొడుకుని బయటకు పంపించాడు. లండన్ నుంచి వచ్చిన డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. దీంతో ఒక్కసారిగా పోలీసు వర్గాల్లో కలకలం రేగింది. ఇక విదేశాల నుంచి వచ్చి నిబంధనలు ఉల్లంఘించి 72మందిపైనా చర్యలు తీసుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది.
లండన్ నుంచి వచ్చిన డీఎస్పీ కొడుక్కి కరోనా:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా కలకలం రేగింది. డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతడిని హైదరాబాద్‌లోని గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. డీఎస్పీ కుటుంబసభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ కొడుకు లండన్‌లో విద్యాభ్యాసం చేస్తున్నాడు. మార్చి 18న లండన్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చాడు. అక్కడి నుంచి కారులో కొత్తగూడెం వెళ్లినట్లు తెలుస్తోంది.
డీఎస్పీ కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలింపు:
బాధిత యువకుడు మార్చి 18 నుంచి 20 వరకు కొత్తగూడెంలోని తన నివాసంలోనే ఉన్నాడు. కుటుంబసభ్యులతో పాటు కొంత మంది బంధువులు, మిత్రులను కలిసినట్లు తెలుస్తోంది. మార్చి 20న దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించడంతో కరోనాగా అనుమానించి ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. అతడి నమూనాలను పరీక్షలకు పంపించారు. ఆదివారం (మార్చి 22) అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో కొత్తగూడెం పోలీసు వర్గాల్లో కలకలం రేగింది. డీఎస్పీ కుటుంబాన్ని, ఇద్దరు గన్ మెన్లను క్వారంటైన్ లో ఉంచారు అధికారులు. అలాగే బాధితుడితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించే పనిలో పడ్డారు.
తెలంగాణలో 33కి చేరిన కరోనా కేసులు:
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 33కి చేరింది. వీటిలో రెండు కాంటాక్ట్ కేసులు ఉన్నాయి. సోమవారం(మార్చి 23,2020) ఒక్క రోజే తెలంగాణలో 6 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. అటు కరీంనగర్ లో కరోనా రెండో దశకు చేరుకుంది. కరోనా వైరస్ తో ఒక్కరు కూడా చనిపోలేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఒక్కరు కూడా వెంటిలేటర్ పై లేరన్నారు. కరోనా బాధితుల్లో ఒకరిని డిశ్చార్జ్ చేశామని, ఒకటి రెండు రోజుల్లో మరింత మందిని డిశ్చార్జ్ చేస్తామన్నారు.
బతికుంటే బలుసాకు తినొచ్చు:
బతికుంటే బలుసాకు తినొచ్చన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ లాక్ డౌన్ కు పిలుపునిచ్చారని మంత్రి ఈటల చెప్పారు. మార్చి 31 వరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, వైరస్ బారి నుంచి కాపాడుకోవాలన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు గుంపులుగా రాకుండా ఇంటికొకరు చొప్పున నిత్యసవరాల కోసం బయటకు రావాలని మంత్రి కోరారు.
రోడ్డుపైకి వస్తే కేసులు, తెలంగాణలో రెండు కాంటాక్ట్ కరోనా కేసులు:
కరోనా వైరస్ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. కొందరు పని లేకపోయినా రోడ్లపైకి వస్తున్నారని మంత్రి మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు పెడతామన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు సెలవులు లేవన్నారు. క్వారంటైన్ లో ఉన్న వాళ్లు ప్రజల్లోకి వెళ్లొద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రజల్లోకి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో కరోనాతో ఒక్కరు కూడా చనిపోలేదన్న మంత్రి ఈటల కరోనా సోకిన వారందరూ కోలుకుంటున్నారని తెలిపారు. ఇటలీలో కరోనా పరిణామాల దృష్ట్యా సీఎం కేసీఆర్ మన యంత్రాంగాన్ని అలర్ట్ చేశారని మంత్రి ఈటల చెప్పారు.
దయచేసి ఊళ్లకు వెళ్లొద్దు:
కరోనా కట్టడికి ప్రభుత్వం అసాధరణ నిర్ణయాలు తీసుకుంటోందని, దయచేసి ప్రజలంతా మార్చి 31 వరకు ఇళ్లలోనే ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ట్రీట్ మెంట్ కంటే సంరక్షణ ముఖ్యం అని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు కాంటాక్ట్ కరోనా కేసులు నమోదయ్యాయమని మంత్రి తెలిపారు. హైదరాబాద్ లో ఒకరికి, కరీంనగర్ లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. దయచేసి ఎవరూ ఊళ్లకు వెళ్లొదన్ని కోరారు. కూకట్ పల్లిలో నివాసం ఉండే వ్యక్తి నిత్యవసరాల కోసం గచ్చబౌలి వస్తే ఎలా అని సీపీ ప్రశ్నించారు. ప్రజలు గుంపులుగా తిరగొద్దన్నారు. ప్రభుత్వ ఆదేశాలు పక్కాగా అమలు చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇంటి పరిసరాల్లోని దుకాణాల్లోనే నిత్యవసరాలు తీసుకోవాలన్నారు. కాగా, మంగళవారం(మార్చి 24,2020) నుంచి ప్రభుత్వ ఆసుపత్రులు గాంధీ, కింగ్ కోఠీ, చెస్ట్, ఫీవర్ లో ఓపీ సేవలు నిలిచిపోతాయని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.
See Also | బిగ్ బ్రేకింగ్ : దేశీయ విమాన సర్వీసులు పూర్తిగా రద్దు..19రాష్ట్రాలు కంప్లీట్ లాక్ డౌన్