Covid-19 : కరోనా కేసుల్లేని గ్రామం

Corona Free Village

Covid-19 : కశ్మీర్‌లో వంద శాతం వ్యాక్సినేషన్‌ గ్రామం గురించి విన్నాం… కానీ… కరోనా ఫ్రీ విలేజ్ గురించి మాత్రం ఎక్కడా వినలేదు. అయితే ఒకటి రెండు దేశాల్లో మాత్రం కరోనా కట్టడి కారణంగా మాస్క్ అవసరం లేదని ప్రకటించారు. ప్రస్తుతం అలాంటిదే మన తెలంగాణలో కూడా ఉందంటే నమ్ముతారా… నిజమే… అది కూడా ఓ చిన్న గ్రామం. వ్యాక్సిన్‌ వేసుకోకున్నా కూడా వైరస్‌ను తమ దరి చేరకుండా కట్టడి చేయగలిగారు ఆ గ్రామస్థులు.

మహారాష్ట్ర పేరు చెబితే చాలు… బాబోయ్ కరోనా అనేలా భయపెట్టింది. ఇక సరిహద్దు గ్రామాలైతే గజగజా వణికిపోయాయి కూడా. కానీ మహారాష్ట్రకు కూతవేటు దూరంలో ఉన్న ఓ పల్లెను మాత్రం కరోనా తాకలేదు. ఆ చిన్న పల్లె కరోనా ఫ్రీ విలేజ్‌గా మారింది. కరోనా దరి చేరకుండా ఆ గ్రామస్థులు కట్టడి చేశారు. నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌ మండలం బిక్‌నెల్లి గ్రామంలో ప్రస్తుతం కరోనా ఫ్రీ విలేజ్‌గా రికార్డుల్లో ఎక్కింది. ఇప్పటి వరకు ఆ గ్రామంలో ఒక్కరు కూడా వైరస్‌ బారిన పడలేదు.

కరోనా సెకెండ్ వేవ్‌లో.. నిజామాబాద్‌ జిల్లాలోని 90 శాతం గ్రామాలు కరోనా బారిన పడ్డాయి. మహారాష్ట్ర సరిహద్దు పల్లెలు కరోనాతో వణికిపోయాయి. పొరుగు రాష్ట్రంతో బంధుత్వాలు ఎక్కువగా ఉన్నా ముందుగా అప్రమత్తమై కట్టడి చర్యలకు దిగడం వల్ల కరోనా భూతాన్ని గ్రామంలో రాకుండా అడ్డుకట్ట వేశారు. బిక్‌నెల్లి గ్రామ జనాభా 500 మంది…. 102 కుటుంబాలు ఆ పల్లెలో నివసిస్తున్నాయి. సాధారణ రోజుల్లో మహారాష్ట్రతో నిత్యం రాకపోకలు కొనసాగేవి. కానీ కేసుల తీవ్రత పెరుగుతున్న సమయంలోనే రాకపోకలు నిషేధించారు. వైరస్‌ కట్టడిపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. బయటి వ్యక్తులు గ్రామంలోకి రాకుండా.. గ్రామస్ధులు బయటికి వెళ్లకుండా నిబంధన పెట్టారు.

గ్రామంలో ఒక్క కేసు కూడా వెలుగు చూడకపోవడంతో… ఆంక్షలను సడలించారు. ఊళ్లో మాస్క్‌ నిబంధన తొలగించారు. ఊరు దాటాలంటే మాత్రం… గ్రామ పెద్దల అనుమతి తీసుకోవాల్సిందే. సరైన కారణం ఉంటేనే అనుమతిస్తారు. మళ్లీ గ్రామంలోకి తిరిగి రావాలన్నా కూడా శానిటైజేషన్ తప్పనిసరి. ప్రస్తుతానికి కరోనా ఫ్రీ, మాస్క్‌ ఫ్రీ విలేజ్గా బిక్‌నెల్లి రికార్డుల్లోకి ఎక్కింది.

అయితే వ్యాక్సిన్‌ తీసుకునేందుకు మాత్రం గ్రామస్థులు భయపడుతున్నారు. టీకా వద్దు బాబోయ్‌ అంటూ పారిపోతున్నారు. ఊరిలో క్యాంపులు పెట్టి అవగాహన కల్పించినా కూడా వ్యాక్సిన్‌ కోసం గ్రామస్థులు ముందుకు రావడం లేదు.

కరోనాను అవగాహనత దరి చేరకుండా జాగ్రత్తపడిన బిక్‌నెల్లి గ్రామస్థులు… ఇప్పుడు మాస్క్‌ లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వ్యాక్సిన్‌పై అపోహలు తొలగించి… మహమ్మారిపై శాశ్వత విజయం సాధించేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.