Hyderabad TIMS : హైదరాబాద్‌ టిమ్స్‌లో దారుణం… ఫ్రీజర్లు లేక మృతదేహాలను ఎక్కడికక్కడ వదిలేసిన సిబ్బంది

దేశంలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ స్థాయిలో తీర్చిదిద్దుతామన్న టిమ్స్ పరిస్థితి ఘోరంగా తయారైంది. కరోనా బాధితులను ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదు.

Corona Patients In Critical Condition At Tims Hyderabad

Hyderabad TIMS Corona patients : దేశంలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ స్థాయిలో తీర్చిదిద్దుతామన్న టిమ్స్ పరిస్థితి ఘోరంగా తయారైంది. కరోనా బాధితులను ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదు. రోగి బెడ్‌పై నుంచి పడిపోయినా కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మృతదేహాలను అలాగే వదిలేస్తున్నారు. తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో.. టిమ్స్‌లో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. టిమ్స్‌లోని 8 అంతస్థలు ఇప్పటికే నిండిపోయాయి. ఫ్రీజర్లు లేక మృతదేహాలను ఎక్కడికక్కడే పడి ఉన్నాయి.

కరోనా ఫస్ట్ వేవ్‌లో గాంధీ హాస్పిటల్ ను ప్రభుత్వం కొవిడ్ నోడల్ సెంటర్​గా మార్చింది. కేసులన్నీ అక్కడికే వెళ్లేవి. కరోనా తీవ్రత పెరిగాక కొన్ని హాస్పిటళ్లలో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. తర్వాత హైదరాబాద్ గచ్చిబౌలిలోని 14 అంతస్థుల భవనంలో టిమ్స్​ ఏర్పాటు చేసి గాంధీకి సమాంతరంగా కరోనా హాస్పిటల్​గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి తగ్గట్లుగా కొన్ని ఏర్పాట్లూ చేసింది. టిమ్స్ ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారుస్తామని ప్రకటించింది. 12వందల 24 బెడ్లు ఉన్న ఈ ఆసుపత్రి డెవలప్​మెంట్​ కోసం వెయ్యి కోట్లను కేటాయించింది. ప్రస్తుతం కేసులు పెరిగి పేషెంట్ల తాకిడి ఎక్కువవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి.

సెకండ్ వేవ్ సమయంలో కేసులు పెరుగుతుండటంతో టిమ్స్​కు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భారీగా పేషెంట్లు వస్తున్నారు. అయితే.. 14 అంత‌‌స్తుల టిమ్స్ బిల్డింగ్​లో ప్రస్తుతం 8 ఫ్లోర్లనే హాస్పిటల్ కోసం వాడుతున్నారు. ప్రస్తుతం అవి పూర్తిగా నిండిపోయాయ్‌. టిమ్స్​లో 137 ఐసీయూ, 800 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. ఐసీయూ బెడ్స్ ఫుల్ అయ్యాయని, 30 మాత్రం ఎమర్జెన్సీ అవసరాల కోసం ఉంచామని తెలిపారు అధికారులు.

మొదటి నుంచి స్టాఫ్ కొరతతో టిమ్స్ సతమతమవుతోంది. ప్రస్తుతం టిమ్స్​లో 120 మంది డాక్టర్లు, 310 మంది స్టాఫ్ నర్సులు, 30 మంది హౌస్​ కీపింగ్ స్టాఫ్ ఉన్నారు. 50 మంది పేషెంట్ కేర్ సర్వీస్ సిబ్బంది పని చేస్తున్నారు. ఇపుడు హాస్పిటల్​కు వస్తున్న పేషంట్ల సంఖ్యకు ఈ స్టాఫ్ ఎటూ సరిపోరని అక్కడి సిబ్బంది చెబుతోంది.