Corona Test
Corona Test: కరోనా పరీక్షల్లో తప్పులు దొర్లుతున్నాయి. అవి సిబ్బంది చేస్తున్న తప్పులో, లేదంటే టెస్టింగ్ కిట్స్ వలన జరుగుతున్న పొరపాటో అనేది తెలుసుకోవడం వైద్యులకు తలనొప్పిగా మారింది. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ కు చెందిన రాజేష్ కు స్వల్పంగా జ్వరం, దగ్గు ఉండటంతో ర్యాపిడ్ యాంటీజన్ పరీక్ష (ర్యాట్) చేయించుకున్నాడు. అయితే అతడి పాజిటివ్ అని తేలింది. మిత్రుడి సలహా మేరకు ఆర్టీపీసీఆర్ చేయించుకోవగా అందులో నెగటివ్ వచ్చింది.
దీంతో ఏం చెయ్యాలో తెలియక వైద్యుల వద్దకు వెళ్ళాడు. కాగా ఇటువంటి సంఘటనలు సెకండ్ వేవ్ లో చాలా జరుగుతున్నట్లు వైద్యులు చెబుతన్నారు. లక్షణాలు లేనివారికి ర్యాట్ చేయిస్తే నెగటివ్ వస్తుంది. ఇటువంటి వారికీ ఆర్టీపీసీఆర్ చేసి నిర్దారించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు ర్యాట్‌లో పాజిటివ్ వస్తే కొందరికి ఆర్టీపీసీఆర్‌లో నెగెటివ్ వస్తున్నది. ఫలితంతో సంబంధం లేకుండా కొన్ని నిర్దిష్ట లక్షణాలుంటే వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు.
జ్వరం, జలుబు, గొంతు నొప్పితోపాటు ఎక్కువ మందిలో డయేరియా వస్తున్నదని, ఇలాంటి లక్షణాలు గుర్తించాలని చెప్తున్నారు. శరీరం కొంచం అలసటగా అనిపించినా, జ్వరం, దగ్గు, జలుబుకుతోడు మరేవైనా లక్షణాలున్న వెంటనే కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు. లక్షణానికి తగిన మందులు వాడాలని చెబుతున్నారు. ఆక్షిజన్ లెవెల్స్ 93 కంటే తక్కువ ఉండకుండా చూసుకోవాలని, ఒకవేళ తక్కువ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.
మార్కెట్‌లో నాణ్యతలేని కొన్ని యాంటిజన్ టెస్టు కిట్ల వల్ల సరైన ఫలితాలు రాకపోవచ్చు. తొలుత నెగెటివ్, ఆ వెంటనే పాజిటివ్ రావడం అనేది సెకండ్ వేవ్ ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు. ఆక్సిజన్ లెవల్స్ తగ్గితే మీకు సమీపంలోని ఆసుపత్రిలో చేరడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.