Corona Impact Realestate
Corona impact on real estate : జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నరియల్ఎస్టేట్ పరుగులకు గతేడాది కరోనా బ్రేకులు వేయగా.. ఆ తర్వాత ధరణితో అది మరింత స్లో అయ్యింది. అయితే మళ్లీ రీజినల్ రింగ్ రోడ్డు వార్తలతో పుంజుకుంటున్నరియల్ రన్‌పై ఇప్పుడు కరోనా సెంకండ్ వేవ్ ఎఫెక్ట్ పడింది. నిన్నటి వరకు కలకలలాడిన వెంచర్లు.. ఇప్పుడు వెలవెల బోతున్నాయి. దీంతో కోట్ల పెట్టుబడులు పెట్టిన రియల్ వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది.
కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు ప్రజల్లో దడ పుట్టిస్తోంది. గతేడాది కరోనాకంటే.. ఇప్పుడు దూసుకొచ్చిన సెకండ్ వేవ్ ఉక్కిబిక్కిరి చేస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ ప్రభావం రాష్ట్రంలోని అన్ని రంగాలపై పడింది. ఇది ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగాన్ని తాకింది. నిన్నటి వరకు ఊపుమీదున్న రియల్ బిజినెస్ పై ఒక్కసారిగా నీళ్ళు చల్లింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దేశంలోనే హైదరాబాద్ సేఫ్ జోన్. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సాగునీటి ప్రాజెక్టులతో.. వ్యవసాయం పెరగడంతో.. హైదరాబాద్ వరకు పరిమితమైన రియల్ బిజినెస్.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. మారుమూల పల్లెల్లో కూడా భూముల విలువ పెరగడంతో.. రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెట్టింది. అయితే ఈ పరుగులకు ఊహించని విధంగా.. గతేడాది కరోనాతో బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత రెవెన్యూ ప్రక్షాళనలో భాగంగా తీసుకువచ్చిన ధరణితో.. వ్యాపారం మరింత స్లో అయ్యింది. కరోనాతో అన్ని రంగాలు స్థంభించి పోవడం ఒక‌్కటైతే.. ధరణి సమస్యలతో వ్యాపారం సరిగ్గా సాగలేదు.
అయితే ఈ ఏడాది మొదట్లో హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. స్థబ్దుగా ఉన్న రియల్ రంగానికి ఊపిరి పోసినట్లయింది. ఆర్ ఆర్ ఆర్ అలైన్మెంట్ కు అధికారుల కసరత్తుతో.. రియల్ రంగంలో స్పీడ్ పెరిగింది. బిల్డర్లు, రియల్టర్లు కోటి ఆశలతో భూ లావాదేవీలను మళ్లీ మొదలు పెట్టారు. అవుటర్ , ట్రిఫుల్ ఆర్ అంటూ వెంచర్లతో పుంజుకుంటుండగా.. ఇప్పుడు రియల్ బిజినెస్ పై మరోసారి కరోనా సెకండ్ వేవ్ పిడుగు పడింది.
గతేడాది మధ్యలో ఆగిన వెంచర్లు, లేఅవుట్లు… హైదరాబాద్ చుట్టూ ప్లాట్లు, ఇండ్ల అమ్మకాల జోరు పెరుగుతుండగా.. కరోనా సెకండ్ వేవ్ రియల్ వ్యాపారంపై నీళ్ళు పోసింది. దీంతో.. వైరస్ భయానికి జనం కాలు బయట పెట్టాలంటేనే వణికిపోతున్నారు. నిర్మాణం పూర్తి అయినా ప్లాట్ల అమ్మకాలు తగ్గాయని బిల్డర్లు ఆందోళన చెందుతున్నారు.
వెంచర్స్ పూర్తి అయినా కొనేవారు లేక పోవడంతో.. తెచ్చిన అప్పులకు వడ్డీల భారం చెల్లించాల్సి వస్తోందని రియల్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు.. కరోనా ఉధృతితో మళ్ళీ వలస కూలీలు స్వంత ఊళ్ల బాట పడుతుండటంతో.. ఆ ప్రాజెక్టులు ఎక్కడివి అక్కడే నిలిచిపోతున్నాయి. ఇదంతా చూస్తుంటే.. రియల్ రంగానికి గతేడాది అనుభవాలు తప్పవేమో అన్న భావన కలుగుతోంది. మరి ఈ సెకండ్ వేవ్‌కు ఎప్పుడు పూర్తి స్థాయిలో బ్రేక్ పడుతుందో చూడాలి.