భారతీయ కోడిని కరోనా కలవరపెడుతోంది. కరోనా దెబ్బకు ఇన్నాళ్లు కొండెక్కిన కోడి ఇప్పుడు కింద పడిపోయింది. సండే వస్తే ముక్క లేనిదే ముద్ద దిగని నాన్ వెజ్ ప్రియులు సైతం.. చికెన్‌ను చిరాకుగా చూస్తున్నారు. గంటలకు గంటలు క్యూ లైన్లో నిల్చొని చికెన్ కొనే వాళ్లు కూడా.. ఇప్పుడు కోడిని చూస్తే కంగారు పడుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి.
చైనాలో మొదలైన కరోనా వైరస్.. భారత దేశంలో కోళ్ల పరిశ్రమను అతలాకుతలం చేస్తోంది. కరోనా వైరస్ వదంతులతో రోజురోజుకు చికెన్ ధరలు పడిపోతున్నాయి. ప్రస్తుతం మాంస ప్రియులు సైతం చికెన్ అంటే బెంబేలెత్తిపోతున్నారు. దీంతో కోళ్ల పరిశ్రమ విలవిలలాడుతోంది. చికెన్ అమ్మకాలను పెంచుకునేందుకు పరిశ్రమ పెద్దలు పడరాని పాట్లు పడుతున్నారు.
కరోనా భయం ఏ రేంజ్ లో ఉందంటే.. ఫ్రీగా ఇస్తామన్నా చికెన్ తినేందుకు ప్రజలు తినే సాహసం చేయట్లేదు.
ఇతర వ్యాధుల కారణంగా కోళ్లు చనిపోతే.. దానిని కూడా రకరకాల ఊహగానాలు ముడిపెడితూ వదంతులు వ్యాప్తి చెందాయి. దీంతో చికెన్ వైపు చూడాలంటే జనం జంకుతున్నారు. ఇక చికెన్ కొనేవారు లేకపోవడంతో ధరలు సైతం అమాంతం పడిపోయాయి. నెల రోజుల వ్యవధిలో కేజీ 200 రూపాయల నుంచి 100 రూపాయలకు పడిపోయింది. అలాగే ఎగ్స్ కూడా డజన్ 60 రూపాయల నుంచి 45 రూపాయలకు పడిపోయింది.
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఫేక్ న్యూస్ కారణంగా… 2 నెలల కాలంలో పరిశ్రమకు 500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. నిండా మునిపోతామని భావించి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. చికెన్ పట్ల జనానికి ఉన్న అపోహలను తొలగించి… కోళ్ల పరిశ్రమను నిలబెట్టేందుకు పరిశ్రమ పెద్దలు సైతం రంగంలోకి దిగారు.
ఏకంగా చికెన్, ఎగ్ మేళాను నిర్వహించి ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించారు. మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్‌ను పిలిచి చికెన్ రుచి చూపించారు. మంత్రులు కూడా చికెన్ పై వస్తున్న వదంతులను కొట్టిపడేశారు. అయినా పరిస్థితి మారినట్లు కనిపించట్లేదు.. సండే నాడు మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది.. కొనేవాళ్లు లేక చికెన్ షాపులు ఖాళీగా కనిపిస్తున్నాయి.
ఇక కరోనా రాక ముందు .. కళకళలాడే తమ వ్యాపారం ప్రస్తుతం వెలవెల బోతోందంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో సాగిన వైరల్ న్యూస్ కాస్త పౌల్ట్రీ పరిశ్రమను నిండా ముంచేసింది. ధరలు పడిపోవడం… గిరాకీలు లేకపోవడంతో పరిశ్రమ మీద ఆధారపడిన వందలాది మంది విలవిలలాడుతున్నారు. జనం భయాలను వీడి మళ్లీ మామూలు పరిస్థితి వస్తే తప్ప తమ జీవితాలు బాగుపడవని వాపోతున్నారు.
Read More : ఇంటివద్దకే ఫించన్లు : జగన్ సర్కార్ రికార్డు