ఫార్మసీ విద్యార్థిని కేసు.. ఏకంగా పోలీస్ కమిషనరే ఆటోడ్రైవర్లకు సారీ చెప్పాల్సి వచ్చింది

cp mahesh bhagwat says sorry to auto drivers: నిండా పాతికేళ్లు కూడా లేని అమ్మాయి. తెలంగాణ పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. ఆడపిల్లల పేరంట్స్ ను వణికించింది. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ సొసైటీని భయపెట్టింది. నగరంలో మరో దిశ లాంటి ఘటన జరిగిందా అని జనం ఆందోళన పడేలా చేసింది. మూడు రోజుల పాటు పెద్ద సీన్ క్రియేట్ చేసింది. తీరా.. క్లైమాక్స్ కి వచ్చే సరికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది.

కిడ్నాప్ లేదు, గ్యాంప్ రేప్ కాదు..అసలు ఆటో డ్రైవర్లే లేరు. అంతా కట్టు కథ..పచ్చి అబద్దం.. సస్పెన్స్ థ్రిల్లర్ టైప్ లో స్టోరీ చెప్పిన అమ్మాయి, చివరికి ఖాకీల ఇంటరాగేషన్ లో అడ్డంగా బుక్కయిపోయింది. నేను చేసిందంతా డ్రామా అని, చెప్పిందంతా కట్టు కథ అని చెంపలేసుకుంది. ఏకంగా పోలీస్ కమిషనరే ఆటో డ్రైవర్లకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితిని కల్పించింది.

ఘట్ కేసర్ ఫార్మసీ విద్యార్థిని కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు విషయంలో తెలిసి పోలీసులే కాదు ప్రజలు కూడా షాక్ తిన్నారు. విద్యార్థిని చెప్పిందంతా కట్టుకథ అని తెలిసి విస్తుపోతున్నారు. ఈ కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. యువతి కిడ్నాప్, రేప్ అంతా కట్టుకథగా తేల్చేశారు. బీఫార్మసీ విద్యార్థినిపై అసలు ఎలాంటి దాడి జరగలేదన్నారు. యువతి కావాలనే కట్టుకథలు అల్లిందని.. పోలీసులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించిందని స్పష్టం చేశారు సీపీ.

చాలా సిల్లీ రీజన్ తో ఆటోడ్రైవర్ ని ఈ కేసులో అమ్మాయి ఇరికించిందని సీపీ చెప్పారు. గతంలో ఓసారి డబ్బు విషయంలో ఆటోడ్రైవర్ పెద్దగా అరవడంతో, అది మనసులో పెట్టుకుని యువతి అతడి పేరు చెప్పినట్టు మీడియాకి చెప్పారు సీపీ. ఘట్ కేసర్ ఘటనలో అనుమానితులుగా భావించిన ఆటోడ్రైవర్లకు క్షమాపణ చెప్పారు సీపీ మహేష్ భగవత్. ఇందులో వారిది ఎలాంటి పాత్ర లేదని, వారికి ఏ విధంగానూ సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఈ కేసులో మూడు రోజుల నుంచి తమ డిపార్ట్ మెంటులో ఎవరికీ నిద్ర లేదని, 100మంది పోలీసులు తీవ్రంగా శ్రమించారని, చివరికి ఇదంతా అమ్మాయి అల్లిన కట్టు కథ అని విచారణలో తేలిందని సీపీ చెప్పారు. షీ టీమ్ వాళ్లు అమ్మాయితో మాట్లాడితే ఒక్క నిమిషంలో ఇదంతా అబద్దం అని తేల్చేశారని సీపీ తెలిపారు.