CP Ranganath: పోలీసులే కొట్టారని వారు అంటున్నారు.. నిజానికి..: వర్సిటీలో విధ్వంసంపై సీపీ రంగనాథ్

కొన్ని వారాల క్రితం నాస్తికుడు భైరి నరేశ్‌పై కొందరు యువకులు దాడి చేసిన ఘటన హత్యాయత్నం అయినప్పటికీ వారు విద్యార్థులని దయతలచి వారిపై బెయిలబుల్ కేసు మాత్రమే పెట్టామని అన్నారు.

CP Ranganath

CP Ranganath – Kakatiya University: వరంగల్‌(Warangal)లోని కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిష‌న్లలో అవ‌క‌త‌వ‌క‌లు జరిగాయంటూ ఈ నెల 5న ఏబీవీపీ చేపట్టిన ఆందోళనలో కంప్యూటర్, ఫర్నిచర్ ధ్వంసం అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ గొడవకు సంబంధించి ఇవాళ కేయూ వీసీ తాటికొండ రమేశ్‌తో కలిసి సీపీ రంగనాథ్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు.

గొడవ చేసిన వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని సీపీ రంగనాథ్ అన్నారు. సీపీ సమక్షంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తమను కొట్టారని ఏబీవీపీ విద్యార్థులు ఆరోపిస్తున్నారని చెప్పారు. వారు ఈ నెల 4న తలుపు పగులగొట్టి వీసీ కార్యాలయంలోకి చొరబడ్డారని అన్నారు.

అంతేగాక, ఈ నెల 5న ప్రిన్సిపల్ కార్యాలయంపై దాడికి దిగారని, ఫర్నిచర్ ద్వంసం చేశారని చెప్పారు. వారిని అరెస్టు చేసే క్రమంలో తోపులాట జరిగిందని, అప్పుడు వారికి ఎలాంటి గాయాలు లేవని డాక్టర్ చెప్పారని తెలిపారు. తాము మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని చెప్పారు.

పోలీసులు కొట్టారని మెజిస్ట్రేట్ ముందు చెప్పడంతో మెడికల్ రీ ఎగ్జామ్ చేయాలని ఆదేశించారని వివరించారు. తోపులాట జరిగినప్పుడు గాయాలు కావడం సహాజమేనని అన్నారు. పోలీసులు కొట్టారనడంలో నిజం లేదని చెప్పారు.

బెయిలబుల్ కేసే పెట్టాం

కొన్ని వారాల క్రితం నాస్తికుడు భైరి నరేశ్‌పై కొందరు యువకులు దాడి చేసిన ఘటన హత్యాయత్నం అయినప్పటికీ వారు విద్యార్థులని బెయిలబుల్ కేసు పెట్టామని అన్నారు. విద్యార్థులు విద్యాసంస్థపై దాడి చేయడం సరికాదని చెప్పారు. పీహెచ్‌డీ అడ్మిష‌న్ల ప్రక్రియ మెరిట్ ప్రకారమే జరిగిందని తెలిపారు. బాధ్యతగల విద్యార్థులు ఎక్కడైనా దాడులు చేస్తారా అని నిలదీశారు. అంబాల కిరణ్ పై 8 క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు.

తలుపులు తన్నుకుంటూ వచ్చారు: వీసీ

వీసీ రమేశ్ మాట్లాడుతూ… కేయూ పీహెచ్‌డీ కేటగిరి-2 అడ్మిషన్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పారు. దౌర్జన్యం చేస్తే పాలకవర్గం లొంగుతుందని కొందరు భావిస్తున్నారని అన్నారు. తాము ప్రతిభ ఉన్నవారికే సీట్లు కేటాయించామని తెలిపారు.

తమకు కులం, మతంతో సంబంధం లేదని, నిబంధనలకు అనుగుణంగానే సీట్లు కేటాయించామని రమేశ్ చెప్పారు. కొందరు విద్యార్థులు ఇటీవల తలుపులు తన్నుకుంటూ వచ్చి, అసభ్య పదజాలంతో తనతో దురుసుగా ప్రవర్తించారని అన్నారు. అక్రమ మార్గంలో పీహెచ్‌డీ అడ్మిషన్లు పొందేందుకే ఇలా చేస్తున్నారని చెప్పారు.

Maharashtra : మంచంపై నుంచి కింద‌ప‌డ్డ మ‌హిళ‌, అగ్నిమాప‌క సిబ్బందికి ఫోన్ చేసిన కుటుంబం