సీఎం రేవంత్ రెడ్డి అరెస్టుకు బీజేపీ కుట్ర: సీపీఐ నారాయణ

రేవంత్ రెడ్డిని మే 1న విచారణకు రావాలని నోటీసుల్లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అంటే ఎన్నికల ప్రచారం ఆపేయించి మానసికంగా దెబ్బతీయాలన్నది బీజేపీ లక్ష్యం. 

CPI Narayana: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవాలన్నదే బీజేపీ లక్ష్యమని, ఆయనను అరెస్ట్ చేయాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు.

హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”రేవంత్ రెడ్డిని మే 1న విచారణకు రావాలని నోటీసుల్లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అంటే ఎన్నికల ప్రచారం ఆపేయించి మానసికంగా దెబ్బతీయాలన్నది బీజేపీ లక్ష్యం. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేస్తే మోదీ పతనం ప్రారంభమైనట్లే. ఇప్పటికే ఢిల్లీ, జార్ఖండ్ సీఎంలను అరెస్టు చేసి జైలుకు పంపారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారన్న సాకుతో కేసుల్లో ఇరికించడం సరికాదు. ప్రధాని మోదీ, అమిత్ షా ప్రసంగాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటున్నాయ”ని అన్నారు.

కేంద్రం బీజేపీ గెలిస్తే సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ కలలు కంటున్నారని.. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్ర మంత్రులు అవుతారని ఆయన చెబుతున్నారని నారాయణ తెలిపారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కూడా కాలేదు.. కాంగ్రెస్ సర్కారు పడిపోయి తమ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ ప్రచారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రుణమాఫీపై పొలిటికల్ డ్రామా నడుస్తోందని, ఎవరూ రాజీనామా చేయరని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ మిత్ర పక్షమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేందుకు సీపీఐ పార్టీ కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని కోరారు.

Also Read: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారం.. ఏం జరగనుంది?

ట్రెండింగ్ వార్తలు