యువకుడి ప్రాణం తీసిన ఇయర్ ఫోన్స్

  • Publish Date - November 22, 2020 / 10:09 AM IST

Young man killed : ఇయర్ ఫోన్స్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ పట్టాలు దాటుతున్న ఆ యువకుడిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని చింతల్‌లో రైలు పట్టాలపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం చింతల్‌ చంద్రవదన కాలనీకి చెందిన అల్లూరి సునీల్‌ (28) పెయింటర్.



సునీల్‌ రోజూలాగే శనివారం కూడా పనికి వెళ్లాడు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఇయర్‌ ఫోన్‌ పెట్టుకొని పాటలు వింటూ చింతల్‌లోని రైలు పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలో ఏడీఆర్‌ఎం స్పెషల్‌ రైలు ఢీకొని తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.



మృతుడి వద్ద లభించిన మొబైల్‌ ఫోన్‌ ఆధారంగా అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. వరంగల్‌ రైల్వేస్టేషన్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.