తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. డీఏ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల డీఏ 3.64 శాతం పెంచుతూ జీవో విడుదల చేసింది. పెరిగిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుంది. జులై 1న చెల్లించే వేతనంలో పెరిగిన డీఏను ఇవ్వనుంది ప్రభుత్వం. అలాగే, బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనుంది.
కాగా, పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను విడుదల చేయాలని ఉద్యోగులు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 2 డీఏలు ఇవ్వాలని ఇటీవల తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. 2023 జనవరి 1 నుంచి ఉన్న డీఏల్లో ఒకదాన్ని వెంటనే అమలు చేయాలని నిర్నయం తీసుకుంది.
ఒక డీఏ చెల్లించేందుకు తెలంగాణ సర్కారుపై ప్రతి నెల సగటున దాదాపు రూ.200 కోట్ల భారం పడుతుంది. అంటే ఏడాదికి రూ.2,400 కోట్ల భారం ఉంటుంది. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ సర్కారు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. వాటికి నిధుల కొరత రాకుండా చూస్తూ మరోవైపు ఉద్యోగులకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సర్కారు భావించింది.