Danam Nagender
Danam Nagender : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ కొనసాగుతున్న వేళ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానంటూ దానం నాగేందర్ కుండబద్దలు కొట్టాడు. మిగతా పిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.
నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేసిన దానం.. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నగర ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారని.. కాంగ్రెస్, ఎంఐఎం కలిపి మొత్తం 300 డివిజన్లు గెలుస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అంతటా నేను ప్రచారం చేస్తా.. కాంగ్రెస్ పార్టీ పథకాలను వివరిస్తానని దానం నాగేందర్ చెప్పారు.
పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ విచారణ జరుగుతున్న సమయంలో దానం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇప్పటి వరకు స్పీకర్ కు వివరణ ఇవ్వని దానం.. త్వరలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీ తరపున ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే దానం ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం దానం వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.