Online Wedding : అమెరికాలో పెండ్లి.. అక్షింతలు సూర్యాపేటలో! కూతురి పెళ్లిని ఆన్‌లైన్‌లో వీక్షించిన తల్లిదండ్రులు..
Parents Watch Daughters Wedding Online : కూతురి పెళ్లి.. ప్రతి తల్లిదండ్రుల జీవితంలో మరిచిపోలేని వేడుక. కానీ అమెరికాలో జరుగుతున్న పెళ్లికి నేరుగా వెళ్లలేకపోయారు ఆ తల్లిదండ్రులు. అయినా టెక్నాలజీ సాయంతో పెళ్లిని ఆన్‌లైన్‌లో వీక్షిస్తూ అక్షింతలు చల్లి, తమ ఆనందాన్ని పంచుకున్నారు.
- Harish Thanniru
- Updated on- August 30, 2026 / 02:15 PM IST
Parents Watch Daughter Wedding Online
Parents Watch Daughters Wedding Online : కూతురి పెళ్లి అంటే తల్లిదండ్రులకు జీవితంలోనే ఓ మధురమైన వేడుక. బంధువులు, స్నేహితులు, గ్రామంలోని ప్రజలను ఆహ్వానించి వారందరి సమక్షంలో అంగరంగ వైభవంగా కుమార్తె పెండ్లి నిర్వహించి తల్లిదండ్రులు సంబురపడిపోతారు. కానీ, సూర్యాపేటలో ఓ కుటుంబం తమ బిడ్డ పెళ్లిని ఆన్‌లైన్ లో నిర్వహించింది. ఆన్‌లైన్‌లో అక్షింతలు వేసి కుమార్తె, అల్లుడిని దీవించారు.
Also Read : Telangana Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ..
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారం గ్రామంకు చెందిన జయరాజు, జ్యోతి దంపతుల ఏకైక కుమార్తె హిమబిందు అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. అక్కడే పరిచయమైన ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్‌తో ప్రేమలో పడింది. ఇరువురి కుటుంబాల అంగీకారంతో శుక్రవారం రాత్రి అమెరికాలో వీరి వివాహం జరిగింది.
అయితే, కూతురి పెళ్లికి తల్లిదండ్రులు నేరుగా హాజరు కాలేకపోయారు. దీంతో వివాహ వేడుకలను ఆన్‌లైన్‌లో వీక్షిస్తూ.. తమ కుమార్తెను ఆశీర్వదించారు. పెళ్లి సమయంలో స్క్రీన్ ముందే ఉండి అక్షింతలు చల్లుతూ ఆనందాన్ని పంచుకున్నారు. కూతురి పెళ్లి అమెరికాలో జరిగినప్పటికీ.. తమ సొంత గ్రామంలో బంధువులు, స్నేహితులు, గ్రామస్థులకు జయరాజు, జ్యోతి దంపతులు పెళ్లి విందు ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో పెళ్లిని వీక్షించిన అనంతరం గ్రామంలో అతిథులకు విందు అందించారు.
సాంకేతికతను ఉపయోగించుకుని కూతురి వివాహ వేడుకలో తల్లిదండ్రులు భాగస్వాములైన తీరు స్థానికంగా ఆసక్తికరంగా మారింది. పెళ్లి అమెరికాలో జరిగినా.. స్వగ్రామంలో పెండ్లి విందు ఏర్పాటు చేయడం గమనార్హం.
