Telangana Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ..
Telangana Rains : తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Telangana Rains
Telangana Rains : తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలతోపాటు ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణలోని తూర్పు, ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. అదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వరంగల్, నిజామాబాద్‌తోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉదయం నుంచి నగరంలో వాతావరణం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నం తరువాత, రాత్రి వేళల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వర్షాలతోపాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
