ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగింపు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

కస్టోడియల్ ఇంటరాగేషన్ సమయంలో ఆమె తప్పించుకునే సమాధానం ఇస్తున్నారని ఈడీ చెప్పింది.

ఢిల్లీ లిక్కర్ కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగింపు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పేర్కొంది. లిక్కర్ కేసు దర్యాప్తునకు కవిత సహకరించడం లేదని చెప్పింది. కవిత పూర్తి వివరాలను బహిర్గతం చేయలేదని తెలిపింది. కవిత వాంగ్మూలాలను నమోదు చేశామని ఈడీ పేర్కొంది.

కస్టోడియల్ ఇంటరాగేషన్ సమయంలో ఆమె తప్పించుకునే సమాధానం ఇస్తున్నారని చెప్పింది. కస్టడీలో మార్చి 17,18,19, 20, 22వ తేదీల్లో కవిత వాంగ్మూలాలు తీసుకున్నామని ఈడీ తెలిపింది. అలాగే, మార్చి 18, 19, 20, 22 తేదీల్లో రిమాండ్‌లో ఉన్న కాలంలో నలుగురు ఇతర నిందితుల వాంగ్మూలాలు కూడా తీసుకున్నామని చెప్పింది.

లిక్కర్ కేసులో దర్యాప్తులో తేలిన విషయాలపై కవితను ప్రశ్నలు అడిగినట్లు ఈడీ తెలిపింది. కవితను సహ నిందితుల వాంగ్మూలాలపై ప్రశ్నించింది. ఫోరెన్సిక్ బృందం కవిత ఫోన్ డేటాను విశ్లేషిస్తోందని ఈడీ చెప్పింది. ఐటీఆర్ కాపీ, కుటుంబ వ్యాపార వివరాలు, ఆర్థిక అంశాలు కొన్ని పత్రాలు/వివరాలు అడిగినట్లు ఈడీ తెలిపింది.

కవిత తన కుటుంబ సభ్యులకు తెలియజేస్తామని చెప్పినట్లు పేర్కొంది. కవిత, ఆమె న్యాయవాది/కుటుంబ సభ్యులు ఏ వివరాలనూ అందించలేదని తెలిపింది. కవిత మేనల్లుడు శరణ్ వ్యాపారం, వృత్తికి సంబంధించిన కొన్ని వివరాలను ఈడీ పేర్కొంది. కవిత అరెస్ట్ సమయంలో జరిపిన సోదాల్లో శరణ్ కి చెందిన మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది.

విచారణకు హాజరుకావాలని రెండుసార్లు పిలిచామని, అయితే విచారణకు హాజరుకాలేదని పేర్కొంది. గత వారం రోజుల విచారణలో ఇండో స్పిరిట్స్ ఎండీ సమీర్ కవిత మధ్య నగదు బదిలీల్లో మేకా సరన్ పాల్గొన్నట్లు వెల్లడైందని చెప్పింది.

Also Read: టీడీపీ, జనసేన జాబితాను చూసి మా వాళ్లు సంబరాలు చేసుకున్నారు: రోజా

ట్రెండింగ్ వార్తలు