Site icon 10TV Telugu

Bhatti Vikramarka: ఆ 7 మండలాలను ఏపీ తిరిగివ్వాల్సిందే, బనకచర్లను కట్టనివ్వం- భట్టి విక్రమార్క

Bhatti Vikramarka

Bhatti Vikramarka: పదేళ్లుగా అనేక ప్రాజెక్టులను బీఆర్ఎస్ పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. మధిర ప్రాంత ప్రజలు ఏళ్లుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. జవహర్ ఎత్తిపోతల పథకంతో వారికి కష్టాలు తీరనున్నాయని చెప్పారు. ఏపీ నిర్మించతలపెట్టిన బనకచర్లను ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా కట్టనివ్వము అని చెప్పారు. అంతేకాదు ఏపీలో కలిపిన ఏడు మండలాలను కూడా తిరిగి ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

”పదేళ్లు బీఆర్ఎస్ నాయకత్వంలో.. ధనిక రాష్ట్రంగా ఉన్నా, నీళ్ల కోసమే తెచ్చుకున్న రాష్ట్రమే అయినప్పటికి కూడా.. ఒక్క చుక్క నీరు కూడా నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకు మళ్లించిన కార్యక్రమం చేపట్టలేదు. పైగా ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు కూడా కట్టకుండా వదిలేయటంతో ఇవాళ రాష్ట్రమంతా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతోంది.

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి జల వనరుల శాఖ మంత్రితో మాట్లాడారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఆయన అడ్డుపడ్డారు కాబట్టే ఇవాళ బనకచర్ల ఆగింది. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా అడ్డుకుంటాం. ఇదే వేదిక నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను దయచేసి ఆపండి. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కేంద్రంలో ప్రధాని మోదీ అయ్యాకే ఏడు మండలాలను, అమాయకులైన గిరిజనులకు సంబంధించిన 2లక్షల ఎకరాల భూములను ఆర్డినెన్స్ ఇచ్చి పోలవరం కట్టుకోవడానికి ధారదత్తం చేశారు.

నిజంగా తెలంగాణ ప్రజలు, అమాయకులైన గిరిజనులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా.. మా భూములు మాకు అప్పజెప్పండి, మా గిరిజన సోదరులకు సంబంధించిన 2లక్షల ఎకరాలు ముంపునకు గురి కాకుండా పోలవరం ప్రాజెక్ట్ కట్టుకునే ప్రయత్నం చేయండి, ఎత్తు తగ్గించుకోండి. బనకచర్లకు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునేది లేనే లేదు” అని భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు.

 

Exit mobile version