Dharani portal real problems : తాళం వేసితిరి…గొళ్లెం మరిచితిరి… అన్నట్లు తయారైంది ధరణి (Dharani) పోర్టల్ పరిస్థితి. దశాబ్దాలుగా… అపరిష్కృతమైన భూ సమస్యల పరిష్కారం అటుంచి .. పరీశీలన కూడా లేకుండా పోయింది. అలాంటి కొన్ని సమస్యలెంటో చూద్దాం.. ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా .. 22ఏ కింద నమోదైన ప్రభుత్వ భూముల వివరాలు.. ఇప్పటికీ ధరణిలో పూర్తి స్థాయిగా కనిపించడంలేదు. రిజిస్ట్రేషన్ (Registration)లలో భూ వివాదాలు, కోర్టు ఆర్డర్లు, కోర్టులిచ్చిన స్టేటస్ కోల వంటి ఉత్తర్వులను కలెక్టర్ల పరిశీలనకు పంపే వ్యవస్థ ధరణి ((Dharani)లో అందుబాటులో లేదు. కొన్ని చోట్ల పట్టా భూములు అసైన్డ్ భూములుగా.. అసైన్డ్ భూములు పట్టా భూములుగా నమోదయ్యాయి. ఇలాంటి భూముల రిజిస్ట్రేషన్‌లను ఆపే వ్యవస్థ ధరణిలో లేదు. కనీసం వీటిని కలెక్టర్లకు పరిశీలనకు పంపే అవకాశం కూడా లేదు.
తహసీల్దార్‌లపై తీవ్రమైన ఒత్తిడి : –
ధరణికి ముందు మ్యూటేషన్లను అధికారులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. డిజిటల్ సంతకాలు పెండింగ్‌లో ఉండటంతో.. ఆన్ లైన్ లో మ్యూటేషన్ (Mutation)లు చేయలేదు. దీంతో.. ఇప్పుడు భూ యజమాని మరోకరికి అమ్ముకునే అవకాశం ఉంది. అదే జరిగితే డబుల్ రిజిస్ట్రేషన్ లకు తెరలేస్తోంది. తెలంగాణ నూతన భూ చట్టం 2020 (Telangana new revenue act 2020) అమలులోకి వచ్చిన తర్వాత.. సీలింగ్ టెనెన్సీ, ఇనాం, అసైన్డ్ , భూదాన్ , వక్ఫ్ భూముల కేసుల పరిస్కారానికి ఎలాంటి వ్యవస్థ లేదు. పార్ట్- బి పరిష్కారానికి సరైన మార్గదర్శకాలు ఇప్పటికి లేవు. దీంతో క్షేత్ర స్థాయిలో తహసీల్దార్‌లపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది.
భూ తగాదాలు పెరిగే అవకాశం : –
విరాసత్ భూములలో కొందరు తమ కుటుంబ సభ్యుల గురించి తప్పుడు వివరాలు అందించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇది నిజమా కాదా.. అని గుర్తించే వ్యవస్థ, సరిదిద్దే వ్యవస్థ ధరణిలో లేదు. దీంతో.. భవిష్యత్తులో మరింతగా భూ తగాదాలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ భాగస్వామ్య భూముల పంపకాలకు సంబంధించి.. తమ బాగానికి సంబందించిన భూమికి కాకుండా.. మొత్తం భూమికి ఫీజు జనరేట్ అవుతుంది. దీనిపై ప్రజల ప్రశ్నలకు తహసీల్దార్ లు సమాధానం చెప్పలేని పరిస్థితి.
ధరణి వచ్చి రెండు నెలలు..అయినా సమస్యలు : –
ఇవే కాకుండా…. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ధరణిలో సరిదిద్దుకునే అవకాశం లేదు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నా… ఇప్పటికీ సమస్యలు వెక్కిరిస్తున్నాయి. వాటి పరిష్కారానికి పోర్టల్‌లో సరైన మార్గదర్శకాలే కరువయ్యాయి. తమ దృష్టికి వచ్చిన సమస్యను పరిష్కరించలేక తహసీల్దార్ లు తలపట్టుకుంటున్నారు. పోనీ ఆర్డివోలకో.. అడిషనల్ కలెక్టర్లు విన్నవిద్దామంటే.. వారికి కూడా దాన్ని పరిష్కరించే అధికారం ధరణి ((Dharani)లో కల్పించలేదు. దీంతో ఇటు తమ చుట్టూ తిరుగుతున్న భూ యజమానులకు చెప్పలేక.. పై అధికారులకు మొరపెట్టుకోలేక ఉక్కిబిక్కిరి అవుతున్నారు తహసీల్దార్‌లు. మరి వీటన్నింటికీ ఎప్పటికి క్లారీటీ వస్తుందో చూడాలి.