Dharmapuri Constituency: ధర్మపురిలో వివేక్ పోటీ చేస్తే ట్రయాంగిల్ ఫైట్.. హీటెక్కుతోన్న ధర్మపురి రాజకీయం!

ప్రస్తుతానికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు కనిపిస్తున్న సీన్‌లోకి వివేక్ ఎంటర్ అయితే పోటీ త్రిముఖ పోరుగా మారుతుందని అంటున్నారు.

Dharmapuri Assembly Constituency Ground Report

Dharmapuri Assembly Constituency: ఎన్నికల సమీపిస్తున్న వేళ ధర్మపురి రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్ ‌(Koppula Eshwar) ఎన్నికపై వివాదం.. మంత్రిని ఈ సారి పార్లమెంట్ బరిలో నిలపనున్నారనే ప్రచారంతో ధర్మపురి రాజకీయం (Dharmapur Politics) హీటెక్కుతోంది. మంత్రి కొప్పుల పోటీకి కోర్టు కేసే అడ్డా.. లేక ఇంకేదైనా కారణముందా? మంత్రిని తప్పిస్తే బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరు? గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ ఈసారి ఎలాంటి వ్యూహాంతో బరిలో దిగబోతోంది? బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెక్ చెప్పేలా ఏ అభ్యర్థిని కమలం బరిలోకి దింపబోతోంది? ధర్మపురిలో ఈసారి కనిపించబోయే సీనేంటి?

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం అధికార బీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా మారిపోయింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) వెన్నంటే నడిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 1994లో టీడీపీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన కొప్పుల ఆ తర్వాత కేసీఆర్‌తో కలిసి.. టీఆర్‌ఎస్ లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ కోరినప్పుడల్లా రాజీనామా చేసి ఉద్యమకారుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారి ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేసిన ఈశ్వర్.. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు.

Koppula Eshwar

ధర్మపురి నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అప్పటి నుండి మంత్రి కొప్పుల ఈశ్వర్ విజయం సాధిస్తూనే ఉన్నారు. ఈ నియోజవర్గంలో మంత్రి కొప్పులకు ప్రత్యమ్నాయ నేత కూడా బీఆర్‌ఎస్‌కు లేరు. కానీ, ఈసారి మంత్రిని పార్లమెంట్‌కు పంపాలనే ప్రతిపాదన బీఆర్‌ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేయాలని మంత్రి కొప్పుల సిద్ధమవుతున్నారు. కానీ, సీనియర్‌గా మంత్రిని పెద్దపల్లి లోక్ సభ బరిలో దింపే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నారన్న ప్రచారం మాత్రం రోజురోజుకు ఎక్కువవుతోంది. అదే గనుక జరిగితే కొప్పుల ప్లేస్లో రీప్లేస్ అయ్యేది ఎవరనేది ఆసక్తిగా మారింది. కొప్పులను పెద్దపల్లి లోక్ సభ బరిలో దింపితే… పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతను చెన్నూరు అసెంబ్లీకి… చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ధర్మపురి అసెంబ్లీకి పోటీకి పెట్టాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందులో ఏది నిజమో గాని.. మంత్రి పోటీపై రకరకాల ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. అయితే తాను అధిష్టానానికి విధేయుడినని ఎక్కడి నుంచి పోటీకి ఆదేశించినా.. శిరసావహిస్తానని చెబుతున్నారు మంత్రి ఈశ్వర్.

Adluri Laxman Kumar

కోర్టు తీర్పుపై ఉత్కంఠ
బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధే మళ్లీ గెలిపిస్తుందన్న ధీమా ప్రదర్శిస్తున్నారు మంత్రి కొప్పుల.. ఐతే ఈ నియెజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కూడా బలంగానే ఉంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ (Adluri Laxman Kumar) కేవలం మూడు వందల ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటిమి పాలయ్యారు. అప్పటి నుంచి నియోజవర్గంలో.. ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నారు లక్ష్మణ్‌కుమార్. గత ఎన్నికల్లో తానే నిజంగా గెలిచానని.. అధికారుల రిజల్ట్‌ను తారుమారు చేశారని.. కోర్టులో కేసు వేశారు లక్ష్మణ్‌కుమార్. ఈ వివాదం ప్రస్తుతం నియెజకవర్గంలో హట్ టాపిక్ గా మారింది. కోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓ వైపు కోర్టులో వివాదం కొనసాగుతుండగానే.. మళ్లీ ఎన్నికలు ముంచుకురావడంతో ఇద్దరు నేతలు మాటలకు పనిచెబుతున్నారు. ఏదైనా సరే ఈ సారి గెలుపు తనదే అంటున్నారు కాంగ్రెస్ నేత లక్ష్మణ్‌కుమార్. మంత్రి కొప్పుల ఈ తొమ్మిదేళ్లలో ఏ అభివృద్ధి చేయలేదని ఆరోపిస్తున్నారు లక్ష్మణ్‌కుమార్. గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చిన లక్ష్మణ్‌కుమార్‌కే ఈ సారి మళ్లీ పోటీ చేసే చాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే గతంలో ఉన్న క్యాడర్‌లో చాలా మంది బీఆర్‌ఎస్‌లో చేరడం కాంగ్రెస్‌కు మైనస్‌గా కనిపిస్తోంది.

Vivek Venkataswamy

వివేక్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారా?
ఇక ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీజేపీ ఎప్పుడూ ప్రభావం చూపలేదు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసిన కన్నం అంజయ్య డిపాజిట్ కూడా తెచ్చుకోలేదు. కానీ, ఈసారి ఇక్కడి నుంచి మాజీ ఎంపీ వివేక్ (Vivek Venkataswamy) పోటీ చేస్తారనే టాక్ రాజకీయాన్ని హీటెక్కిస్తోంది. వివేక్ బరిలో దిగితే ముక్కోణ పోటీ జరగడం ఖాయమని చెబుతున్నారు పరిశీలకులు. కొంతకాలంగా వివేక్ కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పోటీ చేస్తున్నారు. ఐతే వివేక్‌కు టిక్కెట్ అనే ప్రచారాన్ని గతంలో పోటీ చేసిన అంజయ్య ఖండిస్తున్నారు. ఈ సారి తనకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: తనయుడి కోసం పోటీ నుంచి తప్పుకోనున్న సిట్టింగ్ ఎమ్మెల్యే.. జూనియర్ జువ్వాడి సైతం..

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా.. నేనా
ప్రస్తుతానికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు కనిపిస్తున్న సీన్‌లోకి వివేక్ ఎంటర్ అయితే పోటీ త్రిముఖ పోరుగా మారుతుందని అంటున్నారు. నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 10 వేల 896 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుష ఓటర్లే లక్షా 3 వేల 896 మంది కాగా, మహిళలు లక్షా 7 వేల 68 మంది. గ్రామీణ నియోజకవర్గమైన ధర్మపురిలో ఎస్సీల ఓట్లు ఎక్కువ.. సుమారు 42 వేల షెడ్యూల్ కులాల ఓట్లు ఉండగా.. ఇందులో మాదిగ సామాజిక వర్గం ఓట్లే సుమారు 38 వేలు. మాల సామాజిక వర్గం ఓట్లు నాలుగు వేలు ఉంటాయి.

Also Read: జగిత్యాలలో ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీకి దిగుతున్నారు.. పార్టీలు వేస్తున్న లెక్కలేంటి?

ముదిరాజ్, గౌడ, మున్నురుకాపు, యాదవ ఓట్లు కూడా నియోజకవర్గంలో ప్రభావం చూపే స్థాయిలో ఉన్నాయి. గ్రామీణ ఓటర్లు అధికంగా ఉండటంతో పాటుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో గెలుస్తామని బీఆర్ఎస్
ధీమాగా ఉంది. బీజేపీ మాత్రం హిందూత్వ అజెండాపైనే ఆశలు పెట్టుకుంటోంది. గంగా హారతి అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తూ ఓట్ల వేట ప్రారంభించింది కమలం పార్టీ. వరుస ఓటములు.. గత ఎన్నికల్లో అత్యల్ప ఓట్ల తేడాతో సీటు కోల్పోవడం ఈ సారి తనపట్ల సానుభూతి పెరిగేలా చేసిందని.. ఈ సెంటిమెంట్‌తోనే గెలుపు జెండా ఎగరేస్తానని అంటున్నారు కాంగ్రెస్ నేత లక్ష్మణ్‌కుమార్.. మూడు పార్టీల నాయకులూ భారీగా ఆశలు పెంచుకుంటున్నా.. ఓటర్లు మాత్రం ఎవరిని ఆశీర్వదిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు