Koratla constituency: తనయుడి కోసం పోటీ నుంచి తప్పుకోనున్న సిట్టింగ్ ఎమ్మెల్యే.. జూనియర్ జువ్వాడి సైతం..

Koratla constituency: తనయుడి కోసం పోటీ నుంచి తప్పుకోనున్న సిట్టింగ్ ఎమ్మెల్యే.. జూనియర్ జువ్వాడి సైతం..

Koratla Assembly constituency: కోరుట్ల.. గులాబీ పార్టీకి కంచుకోట. నియోజకవర్గం ఏర్పడి నాటి నుంచి ఇక్కడ గులాబీ జెండానే ఎగురుతోంది. అలాంటి సీటులో.. ఈసారి ట్రయాంగిల్ ఫైట్ (Triangle Fight) తప్పేలా లేదనే టాక్ వినిపిస్తోంది. వరుసగా నాలుగు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు (Kalvakuntla Vidyasagar Rao).. ఈసారి తనయుడి కోసం పోటీ నుంచి తప్పుకోనున్నారు. ఆయన గనక పోటీలో లేకపోతే.. బీఆర్ఎస్ (BRS Party) మరోసారి గెలుపు జెండా ఎగరేసే అవకాశం ఉంటుందా? అన్నదే మెయిన్ క్వశ్చన్. అంతేకాదు.. జూనియర్ జువ్వాడి సైతం మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బీజేపీ (BJP) నుంచి కూడా మరో యువ నేత.. టికెట్ రేసులో ఉన్నారు. ఈ రాజకీయ పరిస్థితుల మధ్య.. కోరుట్లలో ఈసారి ఎగరబోయే జెండా ఏ పార్టీది అనేది ఆసక్తిగా మారింది. ఓవరాల్‌గా.. ఈసారి కోరుట్ల సెగ్మెంట్‌లో ఎలాంటి సీన్ కనిపించబోతోంది?

2009లో కొత్తగా ఏర్పడిన కోరుట్ల నియోజకవర్గం.. గులాబీ పార్టీకి కంచుకోటగా మారిపోయింది. ఈ కోటలో ఎలాగైనా పాగా వేసేందుకు.. కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయ్. నియోజకవర్గాల పునర్విభజనలో మెట్‌పల్లి నియోజకవర్గం కాస్తా.. కోరుట్లగా మారిపోయింది. ఆ తర్వాత.. ఇక్కడ కారు జోరు కంటిన్యూ అవుతూ వస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.. వచ్చే ఎన్నికల్లో తన వారుసుడిని బరిలో దింపేందుకు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశారు. కాంగ్రెస్ నుంచి కూడా.. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు.. జువ్వాడి నర్సింగరావు మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు. బీజేపీలో మాత్రం టికెట్ పోరు సాగుతోంది. ఆ పార్టీ నుంచి రాజకీయ వారసుడిగా సురభి నవీన్ రావు బరిలో దిగేందుకు.. చాప కింద నీరులా పనిచేసుకుంటూ వెళ్లిపోతున్నారు. దాంతో.. ఈసారి కోరుట్లలో 3 ప్రధాన పార్టీల నుంచి వారుసులే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్లలో.. ఎవరికి జనామోదం లభిస్తుందన్నదే.. ఆసక్తి రేపుతోంది.

కోరుట్ల నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు, నాలుగు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2 లక్షల 23 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో పద్మశాలిలు 28 వేలు, ముస్లింలు 28 వేల మందికి పైనే ఉన్నారు. మున్నూరు కాపులు 16 వేలు, దళితులు 24 వేల మంది దాకా ఉన్నారు. కోరుట్లలో.. పద్మశాలి, ముస్లింల ఓట్లే.. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తుంటాయనే టాక్ ఉంది. ఇక.. గ్రామీణ ప్రాంతాల్లో మున్నూరు కాపులు, గీత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. గత ఎన్నికల్లో బీసీలు, మైనారిటీలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. దాంతో.. సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.. 20 వేల ఓట్లకు పైనే మెజారిటీతో విజయం సాధించారు.

Kalvakuntla Vidyasagar Rao

కల్వకుంట్ల విద్యాసాగర్ రావు (photo: facebook)

కోరుట్ల నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయినా.. వరుసగా నాలుగు సార్లు కల్వకుంట్ల విద్యాసాగర్ రావునే గెలిపిస్తూ వస్తున్నారు ఇక్కడి ప్రజలు. ఇక్కడ.. మిగతా పార్టీలకు పెద్దగా ప్రాబల్యం లేకపోవడమే.. బీఆర్ఎస్‌కు అనుకూలంగా మారిందని చెప్పొచ్చు. అయితే.. ఇప్పుడు కోరుట్లలో పొలిటికల్ ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయ్. నియోజకవర్గంలో కారు పార్టీ హవా కంటిన్యూ అవుతున్నా.. గతంతో పోలిస్తే బీజేపీ, కాంగ్రెస్ కాస్త పుంజుకున్నాయ్. పైగా.. రాబోయే ఎన్నికల్లో కోరుట్ల బరిలో.. అంతా వారసులే నిలుస్తుండటం కూడా కోరుట్ల పాలిటిక్స్‌లో హీట్ పెంచుతోంది.

Sanjay Kalvakuntla

సంజయ్‌ కల్వకుంట్ల (photo: facebook)

సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఈసారి తనయుడు సంజయ్‌ని పోటీలో నిలిపేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సంజయ్ (Sanjay Kalvakuntla) నియెజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. డోర్ టు డోర్ టచ్ చేస్తూ.. తనని తాను పరిచయం చేసుకుంటున్నారు. అయితే.. అధిష్టానం నిర్ణయం కోసం.. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వేచి చూస్తున్నారు. అలాగే.. ఇచ్చిన హమీల మేరుకు కోరుట్ల నియెజకవర్గాన్ని అభివృద్ది చేశామంటున్నారు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. కేసీఆర్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులే.. బీఆర్ఎస్ గెలుపుకు దోహదపడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన వారసుడిని బరిలో దించే ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. తాను తప్పుకునేది పోటీ నుంచి మాత్రమేనని.. రాజకీయాల నుంచి కాదని అంటున్నారు విద్యాసాగర్ రావు.

Also Read: ఆర్మూరులో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. ఉనికి కోసం కాంగ్రెస్ పాకులాట..

ఇక.. నియోజకవర్గంలో జనంతో మమేకమయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు విద్యాసాగర్ రావు తనయుడు కల్వకుంట్ల సంజయ్. వృత్తిరీత్యా డాక్టర్ కావడంతో.. ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. అదేవిధంగా.. సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై మానిటరింగ్ చేస్తూ.. ప్రజల అవసరాలను తెలుసుకొని.. తండ్రి దృష్టికి తీసుకెళ్తున్నారు. సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో.. బీఆర్ఎస్ విజయం ఖాయమంటున్నారు సంజయ్.

Narsing Rao Juvvadi

జువ్వాడి నర్సింగరావు (photo: facebook)

ఇక.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన జువ్వాడి నర్సింగరావు (Narsing Rao Juvvadi).. మరోసారి హస్తం పార్టీ తరఫున పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయన కూడా ఈసారి గెలుపుపై ధీమాగానే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కొంరెడ్డి రాములు తనయుడు కొంరెడ్డి కరం, సుజిత్ రావు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే.. జువ్వాడికే టికెట్ దక్కే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో ఆశించిన స్థాయిలో కోరుట్లలో అభివృద్ధి జరగలేదని.. ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనని.. నర్సింగ రావు ధీమాగా ఉన్నారు.

JN Venkat

జేఎన్ వెంకట్ (photo: facebook)

గతంతో పోలిస్తే.. కోరుట్లలో బీజేపీ కాస్త పుంజుకుంది. పార్టీ గ్రాఫ్ పెరగడంతో.. టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున జేఎన్ వెంకట్ (JN Venkat) పోటీ చేయగా.. ఈసారి ఆయన సతీమణి సునీత కోసం టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. 2014లో బీజేపీ నుంచి పోటీ చేసిన సురభి భూమ్ రావు తనయుడు సురభి నవీన్ రావు పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రధాని మోదీ చరిష్మానే తమకు అనుకూలిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. నియోజకవర్గానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శిస్తున్నారు నవీన్ రావు.

Also Read: బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఢీకొట్టేదెవరు.. ఈసారి హ్యాట్రిక్ కొడతారా?

మొత్తానికి.. రాబోయే ఎన్నికల్లో గెలుపుపై అన్ని పార్టీల నాయకులు ధీమాగానే కనిపిస్తున్నారు. అయితే.. మారుతున్న రాజకీయ సమీకరణాలతో.. ట్రయాంగిల్ ఫైట్‌లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. కోరుట్లలో మైనారిటీలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండటంతో.. బీజేపీ హిందుత్వ కార్డ్ వాడుతుంనదే లెక్కలున్నాయి. మొత్తంగా.. హిందువుల ఓట్ల మీదే బీజేపీ గురిపెట్టింది. ఇక.. ప్రతి ఎన్నికల్లో తమకు దూరమవుతున్న మైనార్టీలను.. ఈసారి తమ వైపు తిప్పుకునే ఆలోచనలో ఉంది కాంగ్రెస్. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన హస్తం పార్టీ.. ఇప్పుడు మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎన్నికల నాటికి పూర్తిగా బలపడతామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఓవరాల్‌గా.. కోరుట్ల నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో.. అక్కడ ఏ పార్టీ గెలుపు జెండా ఎగరేస్తుందన్నది ఆసక్తిగా మారింది.