Balkonda Constituency: బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఢీకొట్టేదెవరు.. ఈసారి హ్యాట్రిక్ కొడతారా?

బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రిది కావడంతో.. అందరి ఫోకస్ ఈ సెగ్మెంట్‌పైనే ఎక్కువగా ఉంది. ఇక.. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ప్రశాంత్ రెడ్డి ఒకరవడం, జిల్లాకు చెందిన ఒకే ఒక్క మంత్రి కావడం ఆయనకు కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి.

Balkonda Constituency: బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఢీకొట్టేదెవరు.. ఈసారి హ్యాట్రిక్ కొడతారా?

Balkonda Assembly Constituency Ground Report

Balkonda Assembly Constituency : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy).. ఈసారి హ్యాట్రిక్ (hat-trick కొడతారా? లేదా? అనేదే ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. ఇప్పుడు బాల్కొండ నియోజవర్గం గులాబీ పార్టీకి అడ్డాగా మారిపోయింది. మరి.. ఆ అడ్డాలో.. కారు జోరుకు బ్రేకులు వేసి.. కొత్త జెండా ఎగరేసే సత్తా ఏ పార్టీకి ఉందనే చర్చ సాగుతోంది. అంతేకాదు.. ప్రశాంత్ రెడ్డిని ఢీకొట్టేందుకు.. విపక్షాల నుంచి ఎవరెవరు టికెట్ రేసులో ఉన్నారనేది కూడా ఇంట్రస్టింగ్‌గా మారింది. మరి.. అధికార బీఆర్ఎస్ (RRS Party) సిట్టింగ్ సీటును నిలుపుకుంటుందా? బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి కనిపించబోయే సీనేంటి?

బాల్కొండ నియోజకవర్గంలో.. ఏ పార్టీ బలమెంతో తెలుసుకోవడానికంటే ముందు.. అక్కడి పొలిటికల్ హిస్టరీని ఓసారి చూద్దాం. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగాయ్. బాల్కొండ అంటే.. కాంగ్రెస్‌కు కంచుకోట అనే పేరుండేది. అలాంటి సెగ్మెంట్ ఇప్పుడు బీఆర్ఎస్‌కు అడ్డాగా మారిపోయింది. ఇక.. ఈ నియోజకవర్గం నుంచి ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా పనిచేసిన కె.ఆర్.సురేష్ రెడ్డి.. వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. 1989 నుంచి 2009 దాకా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో బాల్కొండలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గెలిచారు. తర్వాత.. కాంగ్రెస్‌లో చేరిపోయారు. 2014, 2018 ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ తరఫున వేముల ప్రశాంత్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు.

బాల్కొండ నియోజకవర్గం పరిధిలో మొత్తం 8 మండలాలున్నాయి. అవి.. బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, మెండోరా, వేల్పూర్, ఎరగట్ల, భీంగల్, ముప్కాల్. వీటి పరిధిలో.. 2 లక్షల 6 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. వీళ్లలో బీసీల ఓట్ బ్యాంక్ అధికంగా ఉంది. ఇక్కడి అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే అంశంలో.. పద్మశాలి, మున్నూరు కాపు ఓటర్లు కీలకం కానున్నారు. ఇక.. పార్టీల విషయానికొస్తే.. బీఆర్ఎస్ తరఫున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జిల్లా మంత్రిగా, సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని.. గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు. అంతేకాదు.. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని.. జనం సమస్యలపై సానుకూలంగా స్పందిస్తారనే పేరు కూడా ఉంది.

Vemula Prashanth Reddy

వేముల ప్రశాంత్ రెడ్డి (Photo: Facebook)

హ్యాట్రిక్ గెలుపు కట్టబెడతారా?
బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రిది కావడంతో.. అందరి ఫోకస్ ఈ సెగ్మెంట్‌పైనే ఎక్కువగా ఉంది. ఇక.. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ప్రశాంత్ రెడ్డి ఒకరవడం, జిల్లాకు చెందిన ఒకే ఒక్క మంత్రి కావడం ఆయనకు కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలుతో పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటంతో.. ప్రశాంత్ రెడ్డికి ఎలాంటి ఢోకా లేదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే.. ఆయన వరుసగా రెండు సార్లు బాల్కొండ నుంచి గెలుపు జెండా ఎగరేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో.. జిల్లాలోని మిగతా సెగ్మెంట్ల కంటే బాల్కొండ ముందు వరుసలో ఉంది. రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నా.. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం.. ప్రశాంత్ రెడ్డికి ప్లస్ పాయింట్‌గా చెబుతున్నారు. తాము చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే నమ్ముకొని ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా బాల్కొండను ఎంతో అభివృద్ధి చేశానని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తనకు హ్యాట్రిక్ గెలుపు కట్టబెడతారని ధీమాగా ఉన్నారు.

Eravathri Anil Kumar

ఈరవత్రి అనిల్

ఈరవత్రి అనిల్ సైలెంట్
బాల్కొండలో ప్రత్యర్థి పార్టీల విషయానికొస్తే.. బీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చే సత్తా ఉన్న నాయకులు లేరనే టాక్ వినిపిస్తోంది. గతంలో పీఆర్పీ నుంచి గెలిచి.. కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న ఈరవత్రి అనిల్ సైలెంట్ అయిపోయారు. ఆయన కాదంటే మాత్రం డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి బరిలో దిగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఇక.. ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి కాంగ్రెస్ చేరితే.. ఆయన కూడా టికెట్ ఆశించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. బాల్కొండ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ నాయకులు.. సిట్టింగ్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గంలో ఆయనెలాంటి అభివృద్ధి చేయలేదని.. ఆల్రెడీ ఉన్న వాటికే రంగులు వేస్తూ.. జనాన్ని మభ్యపెడుతున్నారని చెబుతున్నారు. చేసిన పనుల్లో నాణ్యత లేదని ఆరోపిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈరవత్రి అనిల్ గనక బరిలో నిలవకపోతే.. తాను పోటీ చేస్తానని చెబుతున్నారు మానాల మోహన్ రెడ్డి.

Aleti Mallikarjun Reddy

మల్లికార్జున్ రెడ్డి (Photo: Twitter)

బీజేపీ టిక్కెట్ రేసులో అన్నపూర్ణమ్మ కొడుకు
బీజేపీ విషయానికొస్తే.. మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ తనయుడు మల్లికార్జున్ రెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. అయితే.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఢీకొట్టే సత్తా ఆయనకుందా? లేదా? అన్నదే.. ఇప్పుడు క్వశ్చన్ మార్క్. కానీ.. బీజేపీ టికెట్ ఆశిస్తున్న మల్లికార్జున్ మాత్రం.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో జరిగినన్ని అక్రమాలు ఎక్కడా జరగలేదని.. కోట్ల రూపాయల కుంభకోణాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో.. బాల్కొండ ప్రజలు బీజేపీకే పట్టం కడతారని చెబుతున్నారు.

Also Read: ఆర్మూరులో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. ఉనికి కోసం కాంగ్రెస్ పాకులాట..

Mutyala Sunil Reddy

ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి (Photo: Facebook)

కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న సునీల్ రెడ్డి
ఓవరాల్‌గా చూసుకుంటే.. బాల్కొండలో అధికార బీఆర్ఎస్‌కు మంచి పట్టుంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగానే ఉన్నా.. వాళ్లకు మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఎదుర్కొనేంత బలం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇక.. గత ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేసిన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు గనక హస్తం పార్టీ నుంచి టికెట్ దక్కితే.. గట్టి పోటీ తప్పదనే చర్చ జరుగుతోంది.

Also Read: ఒకసారి గెలిచిన వారు రెండోసారి ఎమ్మెల్యే కాలేదు.. బీఆర్‌ఎస్‌ లో రెండు వర్గాలు.. ఆశ‌లు పెట్టుకున్న కాంగ్రెస్

ఇప్పటికైతే.. బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఎదుర్కొనే బలమైన ప్రత్యర్థులు లేరని చెబుతున్నారు. అయితే.. రెండు ప్రత్యర్థి పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకులు.. మంత్రి ప్రశాంత్ రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు కావడం కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది. నియోజకవర్గంలో బంధుత్వాలు, లోపాయికారి ఒప్పందాలు ఉంటాయని.. రాబోయే ఎన్నికల్లోనూ అవే పనిచేయనున్నట్లుగా ప్రచారమైతే సాగుతోంది. అయితే.. ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేరు కాబట్టి.. ఈసారి బాల్కొండలో ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.