Uppal Constituency: ఒకసారి గెలిచిన వారు రెండోసారి ఎమ్మెల్యే కాలేదు.. బీఆర్‌ఎస్‌ లో రెండు వర్గాలు.. ఆశ‌లు పెట్టుకున్న కాంగ్రెస్

Uppal Constituency: ఒకసారి గెలిచిన వారు రెండోసారి ఎమ్మెల్యే కాలేదు.. బీఆర్‌ఎస్‌ లో రెండు వర్గాలు.. ఆశ‌లు పెట్టుకున్న కాంగ్రెస్

Uppal Assembly constituency : హైదరాబాద్‌ తూర్పున ఉండే ఉప్పల్‌ నియోజకవర్గంపై ప్రధాన పార్టీలు స్పెషల్‌గా ఫోకస్‌ (Special Focus) పెట్టాయి. ఈ నియోజకవర్గంలో గెలిస్తే వాస్తుపరంగా కూడా కలిసొస్తుందని పార్టీల నమ్మకం. ఆ విశ్వాసంతోనే ఉప్పల్‌పై ప్రత్యేక కేర్‌ తీసుకుంటున్నారు నేతలు. 2009లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన వారు రెండోసారి ఎమ్మెల్యే కాలేదు. అంతేకాదు ఒకసారి విజయం సాధించిన పార్టీ మళ్లీ జెండా ఎగరవేసిన చరిత్ర లేదు. ఇలాంటి చోట ఆ ఆనవాయితీకి బ్రేక్‌ వేసి.. వరుసగా రెండోసారి విజయం సాధించాలని చూస్తోంది బీఆర్‌ఎస్‌. నియోజకవర్గం ఏర్పాటయ్యాక తొలిసారి కాంగ్రెస్‌ (congress) గెలిస్తే.. రెండోసారి టీడీపీ మద్దతుతో బీజేపీ గెలిచింది. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నా.. కాంగ్రెస్‌, బీజేపీలు కూడా బలంగానే కనిపిస్తున్నాయి. ఇక్కడ తమకూ పట్టుందని ఈ సారి తమ సత్తా చాటుతామని టీడీపీ కూడా అంటోంది. ఐటీ కారిడార్‌ అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ వెస్ట్‌కు దీటుగా ఈస్ట్‌లో కూడా అభివృద్ధి పరుగులు పెట్టించాలని చూస్తోంది ప్రభుత్వం. సెటిలర్లు, కార్మికులు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో ఈ సారి గెలుపెవరిదో.. ఎవరి సత్తా ఏమిటో ఇప్పుడు చూద్దాం..

హైద‌రాబాద్‌ (Hyderabad) కు తూర్పున స్వాగ‌తం ప‌లికే నియోజ‌క‌వ‌ర్గం ఉప్పల్‌. 2009లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్ వ్యవ‌స్థీక‌ర‌ణ త‌ర్వాత కొత్తగా ఏర్పడిన ఈ నియోజ‌క‌వ‌ర్గం అంత‌కు ముందు మేడ్చల్ అసెంబ్లీలో అంత‌ర్భాగందగా ఉండేది. నాచారం, చర్లపల్లి ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్‌ ఉన్న ఈ నియోజకవర్గంలో కార్మికుల ప్రభావం ఎక్కువ. ఉమ్మడి వరంగల్‌ జిల్లాతోపాటు ఎక్కువ మంది సెటిలర్లు ఈ నియోజవవర్గంలో నివసిస్తున్నారు. సుమారు 4 ల‌క్షల 95 వేల 105 మంది ఓట‌ర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓట‌ర్లే 2 ల‌క్షల 57 వేల 969 మంది. ఇక మ‌హిళా ఓటర్లు 2 లక్షల 37 వేల 102 మంది ఉన్నారు. 2009లో కొత్తగా ఏర్పడిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పటివ‌రకు మూడు సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ మూడు ఎన్నికల్లోనూ ఓటర్లు భిన్నమైన తీర్పు ఇచ్చారు. ఒకసారి గెలిచిన వారిని.. విజయం సాధించిన పార్టీని రెండోసారి మళ్లీ గద్దె నెక్కించలేదు ఉప్పల్‌ ఓటర్లు. 2009లో కాంగ్రెస్‌కు అవ‌కాశం ఇచ్చిన ఓట‌ర్లు.. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీని గెలిపించారు. ఇక 2018లో బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించారు. ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది.. ఎవరి బలం ఎంతో స్పష్టంగా తెలియడం లేదు. మూడు పార్టీలూ గట్టిగా పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (GHMC) ప‌రిధిలో ఉండే ఉప్పల్‌లో మొత్తం ప‌ది డివిజ‌న్లు ఉన్నాయి. గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో మూడు పార్టీలను ఆదరించారు ఓటర్లు. అధికార బీఆర్‌ఎస్ ఆరు డివిజ‌న్ల‌లో పాగా వేయ‌గా.. రెండు చోట్లలో కాంగ్రెస్‌, మ‌రో రెండు స్థానాలను బీజేపీ ద‌క్కించుకున్నాయి. అధికార పార్టీగా బీఆర్‌ఎస్‌ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నా.. ఇప్పుడు మిగిలిన రెండు పార్టీలూ బలం పుంజుకుని పటిష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో వీరి పాత్ర స్పష్టంగా కనిపించింది. ఇక్కడి నుంచి రెండు సార్లు రెడ్డి సామాజిక వ‌ర్గ నేతలే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దాదాపు 65 వేల ఓట్లు ఉన్న రెడ్డి సామాజిక వర్గం విజేతలను నిర్ణయించే స్థితిలో కనిపిస్తోంది.

Bonthu Rammohan

బొంతు రామ్మోహన్ (photo: twitter)

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజవర్గంలో గ్రూప్‌వార్‌ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సారి సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు కాకుండా తనకు టిక్కెట్‌ ఇవ్వాలని అడుగుతున్నారు మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ (Bonthu Rammohan). ఎమ్మెల్యే సుభాశ్‌రెడ్డి, మాజీ మేయర్‌ రామ్మోహన్‌ వర్గాలుగా క్యాడర్‌ నిట్టనిలువునా చీలింది. మంత్రి కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని చెబుతున్న మాజీ మేయర్‌.. టికెట్‌ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేయ‌ర్‌గా ఉప్పల్‌ను ఎంతో అభివృద్ధి చేశాన‌ని చెబుతున్నారు.

Bethi Subhas Reddy

బేతి సుభాష్ రెడ్డి (photo: facebook)

సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి (Bethi Subhas Reddy) మాత్రం ఈ సారి త‌న‌కే టిక్కెట్టు ద‌క్కుతుంద‌ని బ‌లంగా విశ్వసిస్తున్నారు. నిత్యం ప్రజ‌ల్లో ఉంటున్నాన‌ని.. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి త‌ప్ప మ‌రే ఇత‌ర వ్యాప‌కాలు త‌న‌కు లేవంటున్నారు సుభాష్ రెడ్డి. చెరువుల అభివృద్ధి, గ్రేవ్‌ యార్డుల బలోపేతం, శిల్పారామం, ఉప్పల్ భ‌గాయ‌త్‌లో అంద‌రికి ప్లాట్లు వచ్చేలా పనిచేశానని చెబుతున్నారు ఎమ్మెల్యే. ఉద్యమకారుడిగా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు సుభాష్ రెడ్డి.

Ragidi Laxma Reddy

రాగిడి ల‌క్ష్మారెడ్డి (photo: facebook)

ఇక ప్రతిప‌క్ష కాంగ్రెస్ ఉప్పల్‌పై గ‌ట్టి ఆశ‌లు పెట్టుకుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌ల్కాజ్‌గిరి పార్లమెంట్ ప‌రిధిలోనే ఈ నియోజ‌క‌వ‌ర్గం ఉంది. రేవంత్ ఎంపీగా గెలుపొందేందుకు ఉప్పల్ అసెంబ్లీ దోహ‌ద‌ప‌డింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిచిన మూడు డివిజన్లలో రెండు ఉప్పల్‌ పరిధిలో ఉండటం విశేషం. ఉప్పల్‌లో బలంగా ఉన్నామని భావిస్తున్న కాంగ్రెస్‌ ఈ సారి కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతోంది. ఉప్పల్ నుంచి బ‌రిలో దిగేందుకు కాంగ్రెస్ త‌ర‌ఫున ముగ్గురు అభ్యర్థులు పోటీ ప‌డుతున్నారు. పార్టీలో సీనియ‌ర్ నేత రాగిడి ల‌క్ష్మారెడ్డి (Ragidi Laxma Reddy) తో పాటు ఉప్పల్ కార్పొరేట‌ర్ ర‌జిత భ‌ర్త మంద‌ముళ్ల ప‌ర‌మేశ్వర్‌రెడ్డి.. ఏ.ఎస్‌.రావు న‌గ‌ర్ (AS Rao Nagar) కార్పొరేట‌ర్ శిరీష భ‌ర్త సింగిరెడ్డి సోమ‌శేఖ‌ర్ రెడ్డి కూడా టిక్కెట్‌ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ ఇటీవ‌ల విడుద‌ల చేసిన యూత్ డిక్లరేష‌న్‌ను జ‌నంలోకి బ‌లంగా తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ వైఫ‌ల్యాలు.. ముఖ్యంగా ద‌ళిత‌బంధులో స్థానిక ఎమ్మెల్యే 30 శాతం క‌మిష‌న్ వ‌సూలు చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌.. ఎప్పటికప్పుడు ఆందోళనలు చేస్తూ ప్రజల్లోకి దూసుకుపోతోంది. ప్రభుత్వ వైఫల్యాలు.. అవినీతితో పాటు కాంగ్రెస్ గెలిస్తే ఏం చేస్తుంద‌నే దానిని బ‌లంగా తీసుకెళ్తున్నామ‌నే అవే త‌మ‌ను గ‌ట్టేక్కిస్తాయ‌ని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

nvss prabhakar

ఎన్‌.వి.ఎస్‌.ఎస్ ప్రభాక‌ర్ (photo: facebook)

ఉప్పల్ పూర్తిగా గ్రేట‌ర్ ప‌రిధిలో ఉండ‌టంతో క‌మ‌లం పార్టీ కూడా ఎంతో ఆశ పెట్టుకుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపీ హ‌వా కొన‌సాగ‌డంతో ఈ సారి ఉప్పల్‌లో జెండా ఎగ‌రేస్తామ‌నే ధీమా ప్రదర్శిస్తోంది. తెలంగాణ ఏర్పడిన మొద‌టి ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని బీజేపీ త‌ర‌పున ఎన్‌.వి.ఎస్‌.ఎస్ ప్రభాక‌ర్ (nvss prabhakar) గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన త‌ర్వాత కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ స‌హ‌కారంతో నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేశానంటున్నారు ప్రభాక‌ర్‌. కేంద్రం నుంచి 600 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి ప్లై ఓవ‌ర్ బ్రిడ్జిలు నిర్మించామని చెబుతున్నారు ప్రభాకర్‌. ఈసారి బీజేపీకి మ‌రోసారి అవ‌కాశం ఇస్తే ఉప్పల్‌ను మ‌రింత అభివృద్ధి ప‌థంలోకి తీసుకెళ్తామంటున్నారు.

Also Read: కరీంనగర్ లో కాంగ్రెస్ పూర్వవైభవం సాధిస్తుందా.. గంగుల ప్రత్యర్థి ఎవరు.. బండి మళ్లీ అసెంబ్లీకి పోటీచేస్తారా?

మరోవైపు ఉప్పల్ నియోజ‌క‌వ‌ర్గంపై టీడీపీ కూడా కన్నేసింది. 2014లో టీడీపీ మ‌ద్దతుతోనే బీజేపీ గెల‌వ‌గ‌లిగింద‌ని విశ్వసిస్తోంది పసుపు పార్టీ. ఈ సారి త‌మ స‌త్తా చాటుతామ‌ని చెప్పుకొస్తోంది. జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకొని ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తామంటోంది. బ‌ల‌మైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. అదేవిధంగా బీఎస్పీ కూడా ఈ సారి త‌మ అదృష్టం ప‌రీక్షించుకోవాల‌ని చూస్తోంది. బీఎస్పీ స్టేట్ కోఆర్డినేట‌ర్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉండ‌టంతో ఉప్పల్ బ‌రిలో నిల‌వాల‌ని చూస్తోంది. అలాగే ష‌ర్మిల పార్టీ కూడా ఉప్పల్ బ‌రిలో దిగాల‌ని చూస్తోంది.

Also Read: కోదాడలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ.. తానే పోటీ చేస్తానని చెబుతున్న కాంగ్రెస్ నేత..

మొత్తం మీద హైద‌రాబాద్ ఈస్ట్‌లోని ఉప్పల్‌లో పాగా వేసేందుకు అన్ని పార్టీలు త‌హ‌త‌హ‌లాడుతున్నాయి. నియోజ‌క‌వ‌ర్గ ఓట‌ర్లు మాత్రం ప్రతిసారి ఒక్కొక్క పార్టీకి అవ‌కాశం ఇస్తున్నారు. కానీ అధికార బీఆర్‌ఎస్ ఈసారి సంప్రదాయానికి భిన్నంగా సెకండ్ టైం గెలిచి స‌రికొత్త రికార్డు సృష్టిస్తామంటున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్‌, బీజేపీలు కూడా ఈ సారి గెలిచి తీరుతామ‌ని బ‌లంగా విశ్వసిస్తున్నాయి. ఈ త్రిముఖ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో.. ఉప్పల్‌ ఓటర్లు ఎవరి ఆశీర్వదిస్తారో ఉత్కంఠగా మారింది.