Armur constituency: ఆర్మూరులో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. ఉనికి కోసం కాంగ్రెస్ పాకులాట..

గతంలో ఒక ఊపుఊపిన కాంగ్రెస్.. ఇపుడు ఆర్మూరులో ప్రభావం చూపలేకపోతోంది. కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఇంకా తేలలేదు.

Armur constituency: ఆర్మూరులో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. ఉనికి కోసం కాంగ్రెస్ పాకులాట..

Armur Assembly constituency: ఇందూరులో రాజకీయం వాడివేడిగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల లీడర్లు అంతా గ్రౌండ్ లెవెల్‌ (ground level)లో పట్టుకోసం పోరాడుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి కంచుకోటగా ఉన్న ఆర్మూరు… తెలంగాణ (Telangana) ఆవిర్భావం తర్వాత గులాబీ పార్టీకి పెట్టని కోటగా మారింది. ఇప్పుడు ఆర్మూరులో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ (BRS vs BJP) మధ్యే రాజకీయం కొనసాగుతోంది. ఈ రెండు పార్టీల పోటీతో చితికిపోయిన కాంగ్రెస్ ఉనికి కోసం పాకులాడుతోంది. ఈ ఏడాది చివర్లో జరగబోయే ఎన్నికల్లో ఇందూరు (Induru) కోటపై ఏ జెండా ఎగురుతుందో ఆసక్తికరంగా మారింది.

నిజామాబాద్ జిల్లా (Nizambad District)లోని ఆర్మూరు ప్రాంతం రాజకీయ చైతన్యానికి మారు పేరుగా నిలుస్తోంది. రైతాంగ సమస్యలపై పోరాటంలోనూ ఈ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడగా, ఇప్పటివరకు 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 8 సార్లు విజయం సాధించింది. 1957 నుంచి 1983 వరకు వరుసగా 6 సార్లు హస్తం పార్టీ అభ్యర్థులే గెలిచారు.. ఇక తెలుగుదేశం పార్టీ 1985,1994, 2009ల్లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ఆర్మూరుపై పచ్చ జండా ఎగుర వేసింది. 2014, 2018లో వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటింది. ముచ్చటగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు తహతహ లాడుతోంది గులాబీ పార్టీ.

Akula Lalitha

ఆకుల లలిత (Photo: Facebook)

గతంలో ఒక ఊపు ఊపిన కాంగ్రెస్.. ఇపుడు ఆర్మూరులో ప్రభావం చూపలేకపోతోంది. గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన సంతోష్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్ పార్టీ మారారు. 2009లో పోటీ చేసిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆకుల లలిత సైతం గులాబీ కండువా కప్పుకున్నారు. దెబ్బ మీద దెబ్బతో హస్తం పార్టీ కోలుకోవడం లేదు.. పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తున్న ది గ్రాండ్ ఓల్డ్ పార్టీ పుట్టెడు కష్టాల్లో కూరుకుపోయింది. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత (Akula Lalitha) పార్టీ వీడటంతో పెద్ద దిక్కును కోల్పోయింది హస్తం పార్టీ. అయితే ఆర్మూరులో పురుషులు 92 వేల 523 కాగా, మహిళలు ఓట్లు వారికన్నా ఎక్కువగా ఉన్నాయి. లక్షా ఐదు వేల మంది మహిళా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు.

Jeevanreddy

ఆశన్నగారి జీవన్ రెడ్డి (Photo: Facebook)

తెలంగాణా అవిర్భావం నుంచి ఆర్మూరులో ఆశన్నగారి జీవన్ రెడ్డి (Asannagari Jeevan Reddy) జోరు కనిపిస్తోంది. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి.. హ్యాట్రిక్‌పై దృష్టిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే కేసీఆర్ కేబినెట్లో బెర్త్ కూడా దక్కుతుందనే ధీమాతో జోరు పెంచారు. అందరితో కలిసిపోయే నైజం, దూకుడుతో రోజురోజుకూ పార్టీలో పట్టు పెంచుకుంటున్న జీవన్‌రెడ్డి నియోజకవర్గంలో తిరుగులేని నేతగా చలామణీ అవుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లా అధ్యక్ష పదవితో జీవన్ రెడ్డికి మరింత పెద్దపీట వేసింది బీఆర్ఎస్ అధిష్టానం. కోట్లాది రూపాయల నిధులతో ఎన్నడూ లేనంత అభివృద్ధి చేశానని.. రానున్న ఎన్నికల్లోనూ ప్రజలు భారీ మెజారిటీతొ గెలిపిస్తారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధీమాగా ఉన్నారు

Arvind Dharmapuri

ధర్మపురి అరవింద్ (Photo: Facebook)

ఇక బీజేపీ నుంచి స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ (Arvind Dharmapuri) ఆర్మూరు నుంచి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారన్న ప్రచారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. గతంలో బిజెపి నుంచి పోటీ చేసి ఓటమి చెందిన వినయ్‌రెడ్డి సైతం విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. శివాజీ విగ్రహలు ఏర్పాటు చేస్తున్నారు.. ఒకవేళ అరవింద్ రంగంలోకి దిగినే వినయ్‌రెడ్డి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారనుంది. ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఓటర్లు తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు వినయ్‌రెడ్డి.

mahesh kumar goud

మహేశ్ కుమార్ గౌడ్

కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది తేలలేదు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్ (mahesh kumar goud), మాజీ మంత్రి సంతోష్ రెడ్డి కుమారుడు వాసుబాబు పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గంలో పర్యటించారు కూడా. ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయారు. డిచ్పల్లి నుంచి మహేష్ పోటీ చేసిన సమయంలో ప్రస్తుతం ఆర్మూరు సెగ్మెంట్ పరిధిలో ఉన్న నందిపేట్, మాక్లూర్ మండలాలు అప్పట్లో డిచ్పల్లిలో ఉండేవి. తనకు పట్టున్న రెండు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉండటంతో ఆర్మూరు నుంచి పోటీకి ఆసక్తి చూపించారు మహేశ్. కానీ, ఆకస్మాత్తుగా మహేశ్‌కుమార్ సైలెంట్ అయిపోవడంతో కొత్త చర్చలు తెరపైకి వస్తున్నాయి. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఏబి శ్రీనివాస్ ఆర్మూరు నుంచి పోటీకి సై అంటున్నారు. టిక్కెట్లు ఆశిస్తున్న ఈయన నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదనే విమర్శలు ఎదర్కొంటున్నారు.

Also Read: బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ.. తానే పోటీ చేస్తానని చెబుతున్న కాంగ్రెస్ నేత..

ఆర్మూరులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) రైతు దీక్ష తర్వాత చెప్పుకోదగ్గ కార్యక్రమం లేదు. ఆర్మూరులో తమ పార్టీ ఎవరికి పట్టని అనాధగా మారిందని అంటున్నారు సొంత పార్టీ నేతలు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో పార్టీ పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని నిట్టూరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో తమ ఒకప్పటి కంచుకోట ఆర్మూరులో పునర్ వైభవం కోసం… దీటైన నాయకుల అన్వేషణ స్టార్ట్ చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. స్థానికంగా దీటైన అభ్యర్థి కనిపించకపోతే బాల్కొండ నియోజకవర్గానికి చెందిన లీడర్లలో ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించాలని ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 9 సెగ్మెంట్లలో కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు టికెట్ల కోసం పోటీ పడుతుంటే… ఆర్మూరులో మాత్రం విచిత్ర పరిస్థితి ఎదురైంది.. ఒక్కరు కూడా ముందుకు రాకపోవడంతో పార్టీని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలనే దానిపై తలలు పట్టుకుంటున్నారు ఆ పార్టీ పెద్దలు.