పార్టీలకైనా, వ్యక్తులకైనా విమర్శలు, ఆరోపణలు, నిందలు వందలుగా వస్తూనే ఉంటాయి. కానీ ఒకే ఒక లాజిక్ పాయింట్ వాటన్నింటిని పటాపంచలు చేసే బ్రహ్మాస్త్రం అవుతుంది.. అలాంటి పవర్‌ఫుల్ అస్త్రాన్ని ప్లాన్ చేసుకున్నారట సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహ వివాదంపై అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాల నోరుమూయించేందుకు ఈ అస్త్రన్ని సంధించాలనుకున్నారట. ముందే గ్రహించిన బీఆర్ఎస్ దీంతో రూట్ మార్చిందంట.. ఇంతకీ రేవంత్ రెడ్డి లాజిక్ పాయింట్ ఏంటి? గులాబీ నేతలు ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి..? జస్ట్ వాచ్ ఇట్..
అదే లాజిక్‌తో అసెంబ్లీలో బీఆర్ఎస్‌ను కార్నర్?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాజిక్ పాయింట్ అదిరిపోయిందా? అదే లాజిక్‌తో అసెంబ్లీలో బీఆర్ఎస్‌ను కార్నర్ చేయాలనుకున్నారా? అంటే అవుననేది పొలిటికల్ సర్కిల్స్ టాక్.. ఐతే చివరి నిమిషంలో మ్యాటర్ లీకై బీఆర్ఎస్ ట్విస్ట్ ఇచ్చిందని తెలుస్తోంది.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై కొన్నాళ్లుగా రాద్దాంతం చేస్తున్న బీఆర్ఎస్‌కు అసెంబ్లీ వేదికగా దీటుగా సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారట.
పదేళ్లు పవర్‌లో ఉండి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు అధికారికంగా ఏర్పాటు చేయలేదని కడిగిపారేయాలనుకున్నారని సమాచారం. ఐతే విషయం ముందే గ్రహించి ప్రభుత్వమే తమను అసెంబ్లీకి రాకుండా అడ్డుకునేలా పథకం ప్రకారం తప్పించుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
భరతమాత, తెలుగు తల్లి, తెలంగాణ తల్లి.. ఈ విగ్రహ రూపాలు భావోద్వేగాలకు ప్రతీకలు. మన సంస్కృతికి అద్దంపట్టే వేదికలు. ఐతే తెలంగాణలో మాకో తల్లి, మీకో తల్లి అన్నట్టు పరిస్థితి మారిపోయింది. బీఆర్ఎస్ హయాంలో ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తల్లి విగ్రహం మారడంతో రాష్ట్ర రాజకీయాల్లో మాటల మంటలు చెలరేగుతున్నాయి. అది మూమ్మాటికీ కాంగ్రెస్ తల్లి అంటూ ప్రతిపక్షాలు గగ్గోలుపెడుతున్నాయి.
ప్రతిపక్షాల కామెంట్స్‌కు అసెంబ్లీ వేదికగా అదిరిపోయే సమాధానమిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికారికంగా గుర్తించిన తెలంగాణ తల్లి విగ్రహం లేదనే విషయాన్ని కుండబద్ధలు కొట్టారు. ఉద్యమం నాటి నుంచి బీఆర్ఎస్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహమే ప్రాచుర్యంలో ఉందని తేల్చిచెప్పారు. కానీ ఎక్కడా ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని తేల్చి చెప్పారు.
సెంటిమెంట్‌ను తట్టిలేపాలనుకున్న బీఆర్ఎస్?
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో కడిగిపారేయాలని మొదట బీఆర్ఎస్ భావించిందట. మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను తట్టిలేపాలని భావించారట. కానీ సీఎం రేవంత్ రెడ్డి లాజిక్ పాయింట్ గురించి ముందే తెలుసుకున్న బీఆర్‌ఎస్.. సైలెంట్‌గా వెనుకడుగు వేసింది. పదేళ్లలో తల్లి విగ్రహాన్ని ఎందుకు అధికారికంగా ఏర్పాటు చేయలేదని ప్రభుత్వం ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సి వస్తుంది.. ఒకవేళ అసెంబ్లీకి హాజరుకాకుంటే అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తారు.
పొలిటికల్‌గా కార్నర్ కావాల్సి వస్తుంది.. అందుకే బీఆర్‌ఎస్ లీడర్స్ డైవర్షన్ గేమ్ ప్లాన్ చేశారని పొలిటికల్ టాక్.. అందుకే చివరి నిమిషంలో సీఎం రేవంత్, అదానీ కలసి ఉన్న ఫోటోలతో కూడిన టీషర్ట్‌లు వేసుకుని అసెంబ్లీ బాట పట్టారు. నిజానికి విగ్రహ వివాదం వేళ.. అదానీ అంశంతో సంబంధమే లేదు. బీఆర్ఎస్ నేతలు పాత తెలంగాణ తల్లి విగ్రహం ఫోటోతో ఉన్న టీషర్టులు వేసుకొచ్చినా.. నిరసనలా ఉండేది. కానీ అదానీ ఫోటోతో ఉన్న టీషర్టులతో రావడంతో అసెంబ్లీకి నో ఎంట్రీ బోర్డు పెట్టారు పోలీసులు.. దీంతో తమ డైవర్షన్ ప్లాన్ వర్కవుట్ అయ్యిందని, పైగా తమను అసెంబ్లీకి రానివ్వలేదని కౌంటర్ ఎటాక్ చేసే ఛాన్స్ దొరికిందని బీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయనేది పొలిటికల్ సర్కిల్స్ డిబేట్.
మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై రాద్దాంతం చేస్తున్న బీఆర్ఎస్‌కు అసెంబ్లీ సాక్షిగా షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తే.. చివరి నిమిషంలో తప్పించుకున్నారనే చర్చ జరుగుతోంది. ఎవరి ప్లాన్ ఎలా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సభలో లేవనెత్తిన అంశాలపై బీఆర్ఎస్ ఆలోచనల్లో పడిందని తెలుస్తోంది. గత పదేళ్ల పాలనలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు అధికారికంగా ఏర్పాటు చేయలేకపోయామనే పునరాలోచనలో పడిపోయారట గులాబీ పెద్దలు.. ఇదే సమయంలో అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టాలనుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ జస్ట్ మిస్ అయ్యిందనే చర్చ జరుగుతుంది.