×
Ad

తెలంగాణ సీఎం సీటు కోసం ట్రై చేస్తారా? మనసులోని మాటను చెప్పేసిన డీకే అరుణ

"తెలంగాణ తొలి మహిళా సీఎం అయ్యేంతవరకు పట్టు విడవకుండా మీరు ఇలాగే స్ట్రాంగ్‌గా నిలబడతారా?" అన్న ప్రశ్నకు డీకే అరుణ స్పందించారు.

Dk Aruna

DK Aruna: ఓటమిని గెలుపుగా ఏ విధంగా మలుచుకోవాలో మహిళలకు తెలియాలని, ఆ పట్టుదలతో ముందుకు వెళ్లాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. 10టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.

“తెలంగాణ తొలి మహిళా సీఎం అయ్యేంతవరకు పట్టు విడవకుండా మీరు ఇలాగే స్ట్రాంగ్‌గా నిలబడతారా?” అన్న ప్రశ్నకు డీకే అరుణ స్పందించారు. “అదంతా అదృష్టం అనుకోవాలి. ప్రతి ఒక్క మనిషికి ఒక ఆశ లేదంటే లక్ష్యం ఉంటుంది. ఇంతవరకు వచ్చాము.. ఇంకా ఏదన్నా గొప్ప స్థానంలోకి వెళ్లాలనే ఆలోచన ఎవరికీ ఉన్నా తప్పు లేదు. దాని కోసం ప్రయత్నించడంలో కూడా తప్పు లేదు. ఆ తర్వాత అవ్వటం, అవ్వకపోవడం అనేది మన చేతుల్లో ఉండదు. కానీ, తప్పకుండా మనం ప్రయత్నిస్తూనే ఉండాలి” అని చెప్పారు.

Also Read: గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడే కొనేశారనుకో..

నారీ శక్తి గురించి డీకే అరుణ మాట్లాడుతూ… “నారీ శక్తి లేనిది ఏమీ లేదు. 33% రిజర్వేషన్లను మహిళలు అసలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి? వాళ్లకి అవగాహన ఉంటే వాళ్లు దాన్ని ఉపయోగించుకుంటారు. మనకి ఇన్ని అవకాశాలు ఉన్నాయి అన్న విషయం వాళ్లకి అర్థం అవ్వాలి.

మహిళా రిజర్వేషన్ గురించి అందరికీ తెలుసు. జనరల్‌గా లోకల్ బాడీస్‌లో 50% విమన్ రిజర్వేషన్ ఉంది. అయితే, 50% రిజర్వేషన్ విమన్‌కి ఉన్నప్పటికి కూడా ఆ స్థానిక సంస్థలో గెలిచిన వాళ్లు కూడా ఇంకా ముందుకు వెళ్లటం లేదు.. అక్కడే ఆగిపోతున్నారు. ఒకసారి గెలుస్తున్నారు, తర్వాత ఆగిపోతున్నారు.

ఇంకా మనం ప్రయత్నం చేసి పైకి వెళ్దాం ఇంకో మెట్టు ఎక్కుదాం అనే విధంగా ఉండాలి. కానీ కొన్ని సార్లు ఏమైతుందంటే అధికారులు ఇన్వాల్వ్ అయిపోతారు. ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయిపోతారు. దాని వల్ల మహిళలకు అంత స్వతహాగా దాన్ని తెలుసుకొని ముందుకు వెళ్లాలనే అవగాహన కూడా తక్కువ అయిపోతుంది.

నేను ఫస్ట్ పార్లమెంట్ కి పోటీ చేసి ఓడిపోయా, తర్వాత అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయా, తర్వాత లోకల్ బాడీస్‌లో పోటీ చేసి గెలిచా. తర్వాత ఎమ్మెల్యే అయ్యా. మళ్లీ ఎమెల్యే అయ్యా, మళ్లీ ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అయ్యా, ఇప్పుడు ఎంపీ అయ్యా.. పట్టుదలతోనే ఏదైనా సాధించాలనే పట్టుదల విమన్‌కి ఉంటుంది. వాళ్లు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.

రిజర్వేషన్‌లో ఒక విమన్ కంటెస్ట్ చేస్తున్నారంటే అపోజిట్ కూడా విమన్ ఉంటారు. ఎవరో ఒక విమన్ దానిలో గెలుస్తారు. గెలిచేది ఒక విమనే. ఎప్పుడు కూడా ఓటమిని గెలుపుగా ఏ విధంగా మలుచుకోవాలో తెలియాలి. ఆ పట్టుదలతో ముందుకు వెళ్లాలి. ఓడిపోయానని మనం ఇంట్లో పడుకుంటే మనం ఇంకేమి సాధించలేము.

పట్టుదల ఉండాలి.. మనం లక్ష్యం ఏదైనా పెట్టుకోవాలి. లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఆలోచనతో ముందుకు వెళ్లాలి. విమన్ ఆర్ వెరీ స్ట్రాంగ్. వెరీ స్ట్రాంగ్. మనంత స్ట్రాంగ్ ఎవరూ ఉండరు. మగవాళ్లు ఏదైనా చిన్న విషయం వస్తే టెన్షన్ అయిపోతారు. కానీ, ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని తట్టుకొని శక్తి మనకు ఉంటుంది. టెన్షన్‌ను ఎక్కడ కూడా ఫేస్‌లో చూపించం. లోపల ఉన్నదాన్ని ఎక్కడ బయటకి చెప్పుకోము” అని వ్యాఖ్యానించారు.