Harish Rao
Minister Harish Rao: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో ప్రతీయేటా ప్రజలు బెంబేలెత్తిపోతుంటారు. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రభుత్వం అన్నిచర్యలు చేపట్టినప్పటికీ.. కొందరు ఇంటి పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవటంతో సీజనల్ వ్యాధుల భారిన పడుతుంటారు. ముఖ్యంగా ప్రతీయేటా డెంగ్యూ వ్యాధిలో అనేక మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా డెంగ్యూను మన దరికి చేరకుండా చేయొచ్చని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రజలకు సూచించారు.
పగటిపూట దోమలు కుట్టడమే డెంగ్యూకి ప్రధాన కారణమని హరీష్ రావు అన్నారు. కొద్దిపాటి జాగ్రత్తలతో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. డెంగ్యూ నివారణ చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు మంత్రి హరీష్ రావు తన నివాస ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటి ఆవరణలో పూల కుండీలు, ఇతర ప్రాంతాల్లో నిల్వఉన్న నీటిని స్వయంగా మంత్రి తొలగించారు.
https://twitter.com/TrsHarishNews/status/1553625546797355012?cxt=HHwWiMCg7YGNy48rAAAA
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దోమలు రాకుండా పూల కుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కనీసం ప్రతి ఆదివారం 10 నిమిషాలు కేటాయించి మీ ఇంటి చుట్టూ చెత్తా చెదారం, నీళ్లు నిల్వ ఉండకుండా శుభ్రపర్చుకోవాలని, తద్వారా డెంగ్యూ నివారణకు ప్రజలంతా కృషి చేయాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.