Donations to hyderabad flood victims : వరదలతో అల్లాడిపోతున్న భాగ్యనగరాన్ని ఆదుకునేందుకు సినీ, రాజకీయ, వాణిజ్య ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్దఎత్తున విరాళాలు ప్రకటించారు. ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉందామని పిలుపునిచ్చారు.
తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజల్ని ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, రాజకీయ, సినీ, వర్తక, వాణిజ్య ప్రముఖులు ముందుకొచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం 15 కోట్లు, తమిళనాడు సర్కార్ 10 కోట్లు ప్రకటించగా… పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 2 కోట్ల విరాళం ఇచ్చారు.
https://10tv.in/hyderabad-floods-public-outrage-over-political-leaders/
నగరాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చిన ముగ్గురు సీఎంలకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక- జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సైతం వరద బాధితులకు అండగా నిలిచారు. రెండు నెలల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. కిషన్‌రెడ్డి మూడు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు.
ఇక.. వరద బాధితుల్ని ఆదుకునేందుకు టాలీవుడ్ కదిలివచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు తలా కోటి రూపాయల్ని ప్రకటించారు. అక్కినేని నాగార్జున 50 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ 50 లక్షలు, పోతినేని రామ్ 25 లక్షలు, విజయ్ దేవరకొండ 10 లక్షలు, రవితేజ 10 లక్షలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ 10 లక్షలు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ 10 లక్షలు, డైరెక్టర్ హరీశ్ శంకర్ ఐదు లక్షలు, అనిల్ రావిపూడి ఐదు లక్షల విరాళం ఇచ్చారు. ఆపత్కాలం సమయంలో ప్రతి ఒక్కరూ తమకు వీలైనంత సాయం చేయాలని పిలుపునిచ్చారు. క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి అండగా నిలిచి దాతలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్‌లో వరద సహాయ చర్యల కోసం ఇప్పటికే మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రెండు కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించింది.
హైదరాబాద్ వరద బాధితుల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. సీఎం పిలుపు మేరకు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. జనసేన కార్యకర్తలు, తన అభిమానులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వరదలతో కష్టాల్లో ఉన్న హైదరాబాద్ ప్రజలకు అండగా నివాలని కోరారు.