dubbaka polling percentage: దుబ్బాకలో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. సాయంత్రం 5 గంటలలోపు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. దాదాపు 80 శాతం ఓటింగ్ నమోదైనట్టు సమాచారం. సాయంత్రం 5 తర్వాత కరోనా రోగులకు ఓటు హక్కు వేసే అవకాశం ఇచ్చారు అధికారులు. సాయంత్రం 6 గంటల వరకు కోవిడ్ పేషెంట్స్ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆరు గంటల తర్వాత ఈవీఎం మిషన్లను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించనున్నారు.
ఓటు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు:
దుబ్బాక ఉప ఎన్నిక బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత చిట్టాపూర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. దుబ్బాక మండలం బొప్పాపూర్‌లోని పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, తొగుట మండలం తుక్కాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోటీలో 23 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ వీరి మధ్యనే నెలకొంది.
దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ దే విజయం అని భట్టి విక్రమార్క విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారతారని అసత్య ప్రచారం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా దుబ్బాక ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కడతారని భట్టి విక్రమార్క చెప్పారు.
నవంబర్ 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హోరాహోరీగా సాగిన ప్రచారంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉపఎన్నికపై ఆసక్తి పెరిగింది. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా ప్రచారం సాగించారు. సవాళ్లు, విమర్శలతో రాజకీయ వేడి పెంచారు. కాంగ్రెస్ నేతలు తమ పార్టీ కేడర్ సాయంతో క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఎవరు గెలుస్తారు? ఎంత ఆధిక్యం వస్తుందనే అంశంపై అంతటా చర్చలు నడుస్తున్నాయి.