Delhi liquor scam case
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ కొద్దిసేపటికే కవిత భర్తకు నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
అలాగే, కవిత పీఆర్వో రాజేశ్‌తో పాటు ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులు పంపింది. కవిత ఇంట్లో సోదాలు చేసిన వేళ ఐదుగురి సెల్‌ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఈడీ కస్టడీలో కవితను కలిసేందుకు తొమ్మిది మందికి అనుమతి దక్కింది. అందులో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాగే, కవితను కలిసేందుకు ముగ్గురు పీఏలు, ఇద్దరు న్యాయవాదులకు అనుమతి దక్కింది.
కాగా, గత రాత్రి హైడ్రామా మధ్య ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. మధ్యాహ్నం రెండున్నరకు ఇద్దరు మహిళా అధికారులతో కూడిన 8మంది ఈడీ అధికారుల బృందం కవిత ఇంటికి చేరుకుంది. ఐదున్నరగంటల పాటు ఆమెను విచారించి..స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. కవిత ఇంట్లో ఈడీ రైడ్స్ విషయం తెలుసుకొని భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు ఆమె ఇంటికి చేరుకున్నారు. దీంతో కవిత ఇంటిని కేంద్రబలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి.
కవితను విచారిస్తున్న సమయంలో కుటుంబసభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. తర్వాత అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆమెను అరెస్ట్ చేశారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత అరెస్ట్ విషయంపై సమాచారం ఇచ్చింది ఈడీ. కవిత అరెస్ట్ విషయం తెలియగానే ఆమె ఇంటి ముందు రోడ్డుపై బైఠాయించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. బీజేపీకి, ప్రధానిమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అరెస్ట్ విషయం తెలిసిన తర్వాత..మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కేకే కవిత ఇంటికి వెళ్లారు. కాసేపు బయట వెయిట్ చేసిన తర్వాత కేటీఆర్, హరీశ్ రావును లోపలికి అనుమతించారు. అరెస్ట్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు కేటీఆర్. సౌత్‌గ్రూప్‌లో ఎమ్మెల్సీ కవితదే చివరి అరెస్ట్.. సాయంత్రం 5.20కి కవితను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది ఈడీ.