ED temporarily foreclosed Agrigold assets : అగ్రిగోల్డ్‌కు మరో షాక్ తగిలింది. 4వేల 109 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆస్తులన్నీ ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఒడిశాలలో ఉన్నాయి. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో ఏపీలోని 56 ఎకరాల హాయ్ ల్యాండ్ కూడా ఉంది. అంతేకాక.. పలు కంపెనీల్లోని వాటాలు, యంత్రాలను కూడా ఈడీ అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాక.. అగ్రిగోల్డ్‌పై దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ వెల్లడించింది.
అగ్రిగోల్డ్ సంస్థ… ప్రజల నుంచి వేల కోట్లు వసూలు చేసి దుకాణం మూసేసిన సంస్థ. 7 రాష్ట్రాల్లో 6వేల 300 కోట్ల డిపాజిట్లు సేకరించిన అగ్రిగోల్డ్ సంస్థ… ఆ సొమ్మును సొంత ఖాతాల్లోకి మళ్లించుకుంది. కానీ ఇప్పటి వరకు అందరి మదిలో ఉన్న ప్రశ్న ఒకటే… దోచేసిన సొమ్ము ఏం చేశారు…. ఆ డబ్బులు ఎక్కడ పెట్టారు… అవి ఏ రూపంలోకి మార్చారు… దాదాపు ఐదేళ్లుగా ఇదే ప్రశ్న… ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరికింది. అగ్రిగోల్డ్ సంస్థ వ్యవహారాలపై లోతైన దర్యాప్తు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు… అగ్రిగోల్డ్ గుట్టును బయటపెట్టారు.
భారీగా విదేశాల్లో దాచిన అగ్రిగోల్డ్ సొమ్ము జాడ ఎట్టకేలకు బహిర్గతమైంది. సంస్థ యాజమాన్యం ఆ మొత్తాన్ని కరీబియన్ సముద్రంలోని కేమన్ దీవుల్లో దాచినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం విదేశాల్లో ఆర్థికపరమైన సేవలందించే పనామా సంస్థ మొసాక్ ఫొన్సెంకా సహకారం తీసుకున్నట్లు తేలింది. కేమన్ దీవుల్లో డొల్ల కంపెనీలు సృష్టించి పెట్టుబడులను మళ్లించడం ద్వారా అగ్రిగోల్డ్ యాజమాన్యం మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. ఆకర్షణీయ పథకాలతో 7 రాష్ట్రాల్లో సుమారు 32 లక్షల మంది డిపాజిట్‌దారులను మభ్యపెట్టి దాదాపు 6 వేల 380 కోట్ల రూపాయలను అగ్రిగోల్డ్ సంస్థ సేకరించింది.