Rajanala Srihari : వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. దసరా ముందు రోజు కోడి (చికెన్), క్వార్టర్ బాటిల్ (మద్యం) పంపిణీ ఘటనపై ఈసీ ఆయనకు నోటీసులిచ్చింది. మునుగోడు ఓటర్లకు లిక్కర్ పంపిణీ చేశారన్న ఆరోపణలపై ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించింది. రెండు రోజుల్లో మద్యం, చికెన్ పంపిణీపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అటు వరంగల్ కలెక్టర్ ను కూడా ఈసీ వివరణ కోరింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
దసరా రోజున కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. కేసీఆర్ దేశానికి ప్రధాని అవ్వాలని కోరుతూ.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి దసరా ముందురోజు (అక్టోబర్ 4న) హమాలీలకు కోళ్లు, మద్యం పంపిణీ చేశారు. కేసీఆర్ ప్రధాని కావాలని.. కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలని శ్రీహరి ఆకాంక్షించారు. దసరా కానుకగా 200 మంది హమాలీలకు మద్యం, కోళ్లను అందించారు.
రాజనాల శ్రీహరి చేసిన ఈ పని తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బహిరంగంగా మద్యం పంపిణీ చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
కేసీఆర్ కుటుంబంపై వీరాభిమానంతోనే శ్రీహరి ఈ పని చేశారు. వరంగల్ చౌరస్తాలో సుమారు 200 మంది హమాలీ కార్మికులకు కోళ్లు, మద్యం బాటిళ్లను రాజనాల శ్రీహరి ఉచితంగా పంపిణీ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలోనే రాజనాల శ్రీహరి అక్కడి ప్రజలకు మద్యం, కోడి పంపిణీ చేశారని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు అందింది. దీంతో ఈ టీఆర్‌ఎస్ నేతకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.