RTC Electric Autos : బస్సు టికెట్‌తోనే ఆటో ప్రయాణం.. హైదరాబాద్ నగరంలో త్వరలో ఆర్టీసీ కొత్త సేవలు.
RTC Electric Autos : రాష్ట్రంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చే దిశగా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
- Harish Thanniru
- Published on- July 31, 2026 / 02:06 PM IST
RTC Electric Autos
RTC Electric Autos : బస్సు ఎక్కడానికి ఆటో కోసం ఎదురుచూడాల్సిన రోజులకు త్వరలో గుడ్‌బై చెప్పే అవకాశం కనిపిస్తోంది. ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఫస్ట్ మైల్–లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ పేరుతో ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బస్సు టికెట్‌తో పాటు ఆటో టికెట్‌ను కూడా ఒకేసారి బుక్ చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్లు తెలుస్తోంది. తక్కువ ఛార్జీలు, వేగవంతమైన సేవలతో ఈ కొత్త విధానం నగర ప్రయాణికులకు పెద్ద ఊరట కలిగించే అవకాశం ఉంది.
Also Read : Ration Card e-KYC : రేషన్ కార్డు దారులకు అలర్ట్.. ఈ-కేవైసీ గడువు పెంపు.. ఒకేసారి మూడు నెలల బియ్యం..
రాష్ట్రంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చే దిశగా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఎలక్ట్రిక్ ఆటోల తయారీ సంస్థలతో ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.
‘ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ పేరుతో ప్రవేశపెట్టనున్న ఈ సేవల ద్వారా బస్సు ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించనున్నారు. ప్రయాణికులు బస్సు టికెట్‌తో పాటు ఆటో టికెట్‌ను కూడా ఒకేసారి బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. వారు ఉన్న ప్రాంతం నుంచి సమీప బస్ స్టాప్ వరకు ఆటోలో తీసుకెళ్లడంతో పాటు, బస్సు దిగిన తర్వాత అక్కడి నుంచి తుది గమ్యస్థానానికి కూడా ఈ ఎలక్ట్రిక్ ఆటోలు చేరవేస్తాయి.
మొదటి దశలో హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఈ సేవలను ప్రారంభించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అనంతరం వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి ప్రధాన నగరాలకు దశలవారీగా విస్తరించనుంది. ప్రస్తుతం ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ సంస్థల ఆటో ఛార్జీలతో పోలిస్తే ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోల ఛార్జీలు తక్కువగా ఉండేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన రవాణా సేవలు అందే అవకాశం ఉంది.
ఈ సేవల వల్ల ముఖ్యంగా ఎల్బీనగర్, ఉప్పల్, మియాపూర్, పటాన్‌చెరు, రాజేంద్రనగర్, ఘట్కేసర్, శామీర్‌పేట్, శంషాబాద్, శేరిలింగంపల్లి వంటి నగర శివారు ప్రాంతాల ప్రజలకు ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. బస్సులకు మెరుగైన కనెక్టివిటీ ఏర్పడటంతో ప్రయాణ సమయం ఆదా కావడంతో పాటు ప్రజా రవాణాపై మరింత విశ్వాసం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
