Pavuluri Krishna Chowdary : సుప్రసిద్ధ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి కన్నుమూశారు. ఆయన వయసు 96ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో కొన్ని రోజులుగా ఆయన ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి 11గంటల 20 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు నాలుగు నెలల క్రితం గుండె కవాటం మార్పిడి చికిత్స జరిగింది.
పావులూరి భార్య రాజేశ్వరి 2010లో చనిపోయారు. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు 18ఏళ్ల వయసులో చనిపోయారు. చిన్న కుమారుడు డాక్టర్ నరేంద్ర నాథ్ అమెరికాలో వైద్య వృత్తిలో ఉన్నారు. వీరికి కుమార్తె ఉంది. హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు.
పావులూరి మనవరాలు డాక్టర్ అపర్ణ ఆయన బాటలోనే హోమియో వైద్యురాలిగా రాణిస్తున్నారు. పావులూరి పార్థికదేహాన్ని అమీర్ పేట్ లోని ఆయన స్వగృహంలోనే ఉంచనున్నారు. అమెరికా నుంచి ఆయన కుమారుడు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు చెప్పారు.
తెలుగు నాట హోమియో వైద్యాన్ని ప్రతీ ఇంటికి చేర్చడంలో పావులూరి కృష్ణ చౌదరి తన జీవితమంతా విశేషమైన కృషి చేశారు. తన వైద్యంతో ఎంతో మందిని ఆరోగ్యవంతులు అయ్యేలా చేశారు. ఎంబీబీఎస్ చదివిన పావులూరికి తన స్వానుభవంలో జరిగిన ఓ సంఘటన హోమియోపతి వైద్యం వైపు మళ్లించింది. కెమికల్స్ తో కూడిన ఇంగ్లీష్ మందులకంటే సహజ సిద్ధమైన హోమియోపతినే మేలని గుర్తించి ఆ వైద్య సేవలకే అంకితం అయ్యారు.