HCA Scam: హెచ్‌సీఏ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆర్థిక అవకతవకలపై దృష్టి సారించిన ఈడీ, సీఐడీ

హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్)లో ఆర్థిక అవకతవకల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓ వైపు సీఐడీ దర్యాప్తు కొనసాగుతుండగా.. ఈడీ రంగంలోకి దిగింది.

HCA Scam

HCA Scam: హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్)లో ఆర్థిక అవకతవకల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓ వైపు సీఐడీ దర్యాప్తు కొనసాగుతుండగా.. ఈడీ రంగంలోకి దిగింది. హెచ్‌సీఏపై నమోదు చేసిన కేసు వివరాలు ఇవ్వాలని సీఐడీకి ఈడీ లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు, కేసు వివరాలు, వాంగ్మూలాలు ఇవ్వాలని కోరింది. సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేయనుంది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు అరెస్ట్ కాగా.. రిమాండ్ కు తరలించారు.

మరోవైపు.. సీఐడీ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావును కస్టడీ కోరనుంది. నిధుల దుర్వినియోగం వ్యవహారంలో జగన్‌తో పాటు మరికొంత మంది నిందితులను సీఐడీ విచారించనుంది. ఈడీ రాసిన లేఖపై కూడా నిర్ణయం తీసుకోనుంది. అయితే, హెచ్‌సీఏ వివాదంలోకి ఎంటర్ అయిన ఈడీ నెక్స్ట్ యాక్షన్ ప్లానేంటి.. అనే అంశం ఇప్పుడు క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. కోట్ల రూపాయల నిధుల గల్లంతు, కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యవహారంపై ఈడీ విచారణ చేయనుంది. ఈ క్రమంలో ఈసీఐఆర్ నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ, బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు గోల్‌మాల్ వ్యవహారంపై ఈడీ, సీఐడీ దృష్టిసారించాయి. క్రీడా పరికరాల కొనుగోలు స్టేడియం నిర్వహణలో అవకతవకలు జరిగాయని సీఐడీ చెబుతుంది. ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి ఉప్పల్ స్టేడియంలో ప్లంబింగ్ పనుల నిమిత్తం రూ.21.7 లక్షలు ఖర్చు చేసినట్లు హెచ్‌సీఏ లెక్కలు చూపించింది. ప్లంబింగ్ పనులు మొత్తం తామే పూర్తి చేశామని ప్రకటించింది.

2024-2025 సీజన్ -18 కోసం 1,340 క్రికెట్ బంతులు కొనుగోలుకు రూ.1.04 కోట్లు ఖర్చు చేశామని హెచ్‌సీఏ ఆన్ రికార్డ్. ఆ బంతుల వివరాలు స్టాక్ రికార్డులో నమోదు చేయలేదని సీఐడీ గుర్తించింది. ఏసీల కోసం 11.86లక్షలు ఖర్చుచేసినట్లు హెచ్‌సీఏ లెక్కలు చూపించగా.. ఈ కొనుగోలు ప్రక్రియ టెండర్ల ద్వారా జరగలేదని సీఐడీ తేల్చింది.

ఇప్పటికే ఈడీ హెచ్‌సీఏ పాత కమిటీ హయాంలో జరిగిన అవకతకవలపై విచారణ చేస్తుంది. గతంలో అధ్యక్షులు అజారుద్దీన్ ఉన్న సమయంలో పెద్దెత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ఈడీ.. మొత్తం రూ. 51.29లక్షలు విలువైన ఆస్తులు అటాచ్ చేసింది. గత హెచ్‌సీఏ అధ్యక్షులుగా ఉన్న అజారుద్దీన్‌ను ఈడీ ప్రశ్నించింది.