KCR : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావటానికి సిద్ధమవుతున్నారు. సుమారు 7 నెలల గ్యాప్ తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. దీంతో బడ్జెట్ సమావేశాల్లో ఆయన ఏం మాట్లాడబోతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక్కరోజే సభకు వస్తారా, లేదంటే అన్ని రోజులు సభకు వస్తారా? ఇంతకీ గులాబీ బాస్ ప్లాన్ ఏంటి?
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలకు గులాబీ బాస్ హాజరుకాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా మూడుసార్లు మాత్రమే ఆయన తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశాలకు హాజరయ్యారు.
Also Read : తీన్మార్ మల్లన్నలాంటి వాళ్ల గురించి మాట్లాడితే నా విలువ తగ్గుతుంది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
అయితే, అసెంబ్లీకి మాత్రం ఏడు నెలల క్రితం గతేడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ సభకు వచ్చారు. అప్పటి నుంచి మళ్లీ అటువైపు చూడలేదు. దీంతో అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా కేసీఆర్ సభకు హాజరుకాకపోవటంపై విమర్శలు సంధిస్తున్నాయి. సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు సందర్భం వచ్చినప్పుడల్లా దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కేసీఆర్ కు సవాల్ విసురుతున్నారు.
ఈ మధ్యే తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన కేసీఆర్.. ఇకపై నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. గులాబీ పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25 వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : తెలంగాణలో రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. డేట్ ఫిక్స్
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. తాను కూడా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉండటంతో సభకు హాజరు కావాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈసారి బడ్జెట్ సమావేశాలకు గులాబీ బాస్ హాజరవడం పక్కా అని పార్టీ నేతలు చెబుతున్నారు.