Kcr : అన్నం తింటుంటే 2సార్లు కరెంట్ పోయింది, మళ్లీ కష్టాలు మొదలయ్యాయి- కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్

మళ్లీ నీళ్ల ట్యాంకర్లు, బిందులు ఎందుకు కనిపిస్తున్నాయి? 5 ఎకరాల వరకే రైతుబంధు ఇస్తామంటున్నారు.

Kcr : కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కాంగ్రెస్ రాజ్యంలో మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయని ఆయన ధ్వజమెత్తారు. రోజుకు 10 సార్లు కరెంటు పోతోందని వాపోయారు. నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేసీఆర్. అనంతరం కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు.

”కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కాంగ్రెస్ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా వచ్చిందా? బీఆర్ఎస్ హయాంలో 5 మెడికల్ కాలేజీలు వచ్చాయి. అడ్డగోలు హామీలు, దుష్ప్రచారంతో ఒకటిన్నర శాతం ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రైతుబంధు అందరికీ వచ్చిందా? ప్రతి ఆడబిడ్డకు రూ.2500, స్కూటీలు వచ్చాయా?

బీఆర్ఎస్ పాలనలో 24గంటల పాటు కరెంట్ ఇచ్చాం. కాంగ్రెస్ రాజ్యంలో కరెంట్ కోతలు మొదలయ్యాయి. ఇప్పుడు రోజుకు 10సార్లు కరెంట్ పోతోంది. మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి మంచినీరు అందించాం. మళ్లీ నీళ్ల ట్యాంకర్లు, బిందులు ఎందుకు కనిపిస్తున్నాయి? 5 ఎకరాల వరకే రైతుబంధు ఇస్తామంటున్నారు. మిగతా రైతులు ఏం పాపం చేశారు? 15 ఎకరాల వరకు అయినా రైతుబంధు ఇవ్వాలి. కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ గెలవాలి” అని కేసీఆర్ అన్నారు.

”బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టం. మోదీ వంద నినాదాలు చెప్పారా? ఒక్కటైనా జరిగిందా? పదేళ్ల కాలంలో రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందా? దేశానికి బుల్లెట్ రైళ్లు వచ్చాయా? గ్యాస్ ధరలు తగ్గాయా? తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల అయినా ఇచ్చారా? దేశమంతా మెడికల్ కాలేజీలు ఇచ్చి తెలంగాణకు మాత్రం ఇవ్వలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ నాపై ఒత్తిడి తెచ్చారు. నా తల తీసినా.. మోటార్లకు మీటర్లు పెట్టనని మోదీకి చెప్పా. ఇప్పుడు బీజేపీకి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయి. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిని సీఎం రేవంత్ తిడుతున్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావటం ఖాయం.

తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాలను బాగా చూసుకున్నా. వలసల జిల్లా పాలమూరును సస్యశ్యామలంగా మార్చా. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేవలం 1.80శాతం ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అధికారం పోయింది. బీఆర్ఎస్ పాలనలో రెప్పపాటు కాలం కూడా కరెంట్ పోలేదు. కేసీఆర్ దిగిపోగానే కరెంటు ఎందుకు ఉండటం లేదు? శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో అన్నం తింటుంటే.. 2 సార్లు కరెంట్ పోయింది. సీఎం రేవంత్ మాత్రం కరెంట్ పోవటం లేదని అంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు తీసుకొచ్చాను. ఈ ప్రభుత్వం రైతులందరికీ రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదు? తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడేందుకు కేసీఆర్ ను గెలిపించాలి” అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

”పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే పోరాడి తెలంగాణ సాధించా. తెలంగాణ కోసం పోరాడితే ఖమ్మం జైల్ లో వేశారు. ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పాలమూరు జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలే. నేను వచ్చినంక 5 మెడికల్ కాలేజీలు తెచ్చాను. రైతులకు నేటికీ రైతు బంధు రాలేదు, రెండు లక్షల రుణమాఫీ లేదు, కళ్యాణ లక్ష్మి జాడనే లేదు. 5 ఎకరాల లోపు రైతులకే రైతు బంద్ అంట. ఆపై భూమి ఉన్న రైతుల సంగతి ఏంటి? కాంగ్రెస్ రాజ్యంలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. కరెంటు లేక 225 మంది రైతులు చనిపోయారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం నయా పైసా ఇవ్వలేదు. మీ ఓటు ద్వారా ధర్మాన్ని గెలిపించండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఆశీర్వదించండి. ప్రవీణ్ కుమార్ అల్లాటప్పా నాయకుడు కాదు. చదువుకున్న మేధావి.

మోడీ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పారు. నా తల తెగినా పెట్టనని చెప్పా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష వ్యాస బాగోలేదు. ఇష్టం వచ్చినట్లుగా దిగజారుడు పదజాలం వాడుతున్నారు. ఇది పద్ధతి కాదు. బీజేపీకి ఓటు వేస్తే మళ్ళీ మీటర్లు పెడ్తారు. ఉద్యమంలో చాలాసార్లు నాగర్ కర్నూల్ కి వచ్చా.
ఉద్యమంలో కేసీఆర్ తెచ్చుడో సచ్చుడో లాగా చేశాం. అప్పుడే నన్ను ఖమ్మం జైల్లో వేశారు. నేను మహబూబ్ నగర్ ఎంపీగా వున్నపుడే తెలంగాణ తెచ్చుకున్నాం. మొన్న ఎన్నికల్లో నోటికొచ్చినట్టు మాట్లాడి అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది.

అయ్యా ముఖ్యమంత్రి.. ప్రజల మద్యలో వుండి మాట్లాడుతున్నా. ఇంకా రైతుబంధు రాలేదట. నేటికీ వరి ధాన్యానికి బోనస్ కాదు. బోగస్ అయ్యింది. కాంగ్రెస్ రాజ్యంలో కరెంట్ పోతోంది. మేము ఇచ్చిన కరెంట్ అలాగే ఇయ్యొచ్చు కదా. రోజుకు 10 సార్లు పోతోంది. శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో మాజీ ఎమ్మెల్యేతో మీటింగ్ పెడితే కరెంట్ పోయింది. నా మెదడు కరగబెట్టి రైతుబంధు తెచ్చా. నేను ఉన్నప్పుడు ఠంగ్ ఠంగ్ అని రైతు బంధు డబ్బులు పడి మెసేజ్ వస్తుండే.

మీకు దండం పెట్టి చెప్తున్నా. మీ తరఫున మాట్లాడాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపించండి. ఆలంపూర్ వాసి. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు. యువకులు బుద్ధితో ఆలోచన చేయాలి. బీజేపీ చెప్పే సుద్దులు వినడానికి పిచ్చొలమ? బీజేపీకి ఓటు వేస్తే మళ్ళీ మీటర్లు పెడుతారు. ధర్మాన్ని గెలిపించండి. మళ్ళీ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది” అని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read : రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర, కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?

ట్రెండింగ్ వార్తలు