×
Ad

Harish Rao: ఎవరు గెలవాలి.. లేడీనా? రౌడీనా? జూబ్లీహిల్స్ ఓటర్లు తేల్చుకోవాలి- హరీశ్ రావు

రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఇళ్లు కూల్చడం తప్ప ఒక్కరికైనా ఇల్లు కట్టారా? హైదరాబాద్ లో కేసీఆర్ లక్ష ఇళ్లు కడితే రేవంత్ రెడ్డి లక్ష ఇళ్లను కూలగొట్టారు.

Harish Rao: హైదరాబాద్ షేక్ పేట్ లోని అంబేద్కర్ నగర్ లో కార్నర్ మీటింగ్ లో మాజీమంత్రి హరీశ్ రావు మాట్లాడారు. మీరందరూ ఇష్టపడి గెలిపించుకున్న మాగంటి గోపీనాథ్ అనారోగ్యం కారణంగా చనిపోవడం దురదృష్టకరం అని ఆయన వాపోయారు. మగ దిక్కు లేని ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిల్చుందన్నారు. గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు వారి సతీమణికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందన్నారు. భర్త లేని సంసారానికి ఎన్ని తిప్పలు ఉంటాయో మనకు తెలియదా?

బాధతో, దుఃఖంలో ఉన్న ఆడబిడ్డను కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని హరీశ్ రావు విరుచుకుపడ్డారు. సునీతమ్మను అవహేళన చేసిన కాంగ్రెస్ నాయకులకు మీరే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేదలకు, బస్తీ వాసులకు అండగా నిలిచారని అన్నారు. ఎదురీతకు లేడీ నిలుచుంటే అటు దిక్కు రౌడీ నిలుచున్నాడని.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై విరుచుకుపడ్డారు.

”ఎవరు గెలవాలి.. లేడీనా? రౌడీనా? నేను మీకు మాటిస్తున్నా. నా ఇల్లు ఇక్కడి నుంచి 10 నిమిషాలు దూరం. మీ బస్తీ సమస్యలను పరిష్కరించేందుకు.. మీకు ఏ ఆపద ఉన్నా, ఏ పని పడ్డా సునీతమ్మ ఒకటే కాదు మేమందరం ఆమె కోసం అండగా ఉంటాం. మీకు సేవ చేస్తాం. ముఖ్యమంత్రి రోడ్ షోలకు జూబ్లీహిల్స్ ప్రజలు రావడం లేదని కొడంగల్ నుంచి జనాలను తరలిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు 2,500 ఇస్తామని అన్నారు. అవి ఇవ్వకుండా మోసం చేశారు. మహిళలకు 2,500 రావాలంటే బీఆర్ఎస్ ని గెలిపించాలి. హామీలు ఎగ్గొట్టినా గెలిపించారని రేవంత్ రెడ్డి హామీలను అమలు చేయడు. జూబ్లీహిల్స్ లోని ఓటర్లు కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టబోతున్నారు. కేసీఆర్ మాట మనిషి. 200 పెన్షన్ ని 2వేలు చేసింది కేసీఆర్.

ఆడబిడ్డ కాన్పుకైతే కేసీఆర్ కిట్టు తెచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించింది ఎవరు? బతుకమ్మ చీరలు ఇచ్చింది ఎవరు? కేసీఆర్ కాదా? ఇంటింటికి నల్లా ద్వారా తాగే నీళ్లు ఇచ్చింది కేసీఆర్. కరెంటు కోతలు లేకుండా చేసింది కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏం చేశారు? హైడ్రా తేవడం తప్ప? ఈ అంబేద్కర్ నగర్ లో కూడా హైడ్రా నోటీసులు ఇచ్చారు. నోటీస్ ఇచ్చాక కూడా కాంగ్రెస్ కు ఓటేస్తే ఇల్లు కూలగొట్టడానికి అనుమతిచ్చారని రేవంత్ అనుకుంటారు.

రేవంత్ లక్ష ఇళ్లను కూలగొట్టారు..

ఇల్లు కూలగొడతాం అన్నాక కూడా ఎవరైనా కాంగ్రెస్ కి ఓటు వేస్తారా? రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఇళ్లు కూల్చడం తప్ప ఒక్కరికైనా ఇల్లు కట్టారా? హైదరాబాద్ లో కేసీఆర్ లక్ష ఇళ్లు కడితే రేవంత్ రెడ్డి లక్ష ఇళ్లను కూలగొట్టారు. జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డిని ఓడగొడితే మహబూబ్ నగర్ లోని అవ్వ 4వేల పెన్షన్ వస్తుందని ఎదురుచూస్తున్నది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడగొడితే 2,500 వస్తాయని నల్గొండ చెల్లి ఎదురుచూస్తున్నది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడకొడితే కరీంనగర్ లో రైతన్న తనకు 15వేల రైతుబంధు వస్తుందని ఎదురుచూస్తున్నాడు.

ఫీజు రీయంబర్స్ మెంట్ కింద చదువుకునే విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇవ్వడం లేదు రేవంత్ రెడ్డి. కరోనా వచ్చినా కష్టం వచ్చినా ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ విద్యార్థులకు అందించింది కేసీఆర్ ప్రభుత్వం. కరోనా సమయంలో కేసీఆర్ కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. రేవంత్ రెడ్డి మాటలకు మీ చేతలతో సమాధానం చెప్పాలి.

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. బోగస్ ఓట్లతోని, దొంగ ఓట్లతోని గెలవాలని చూస్తున్నారు. కారు గుర్తుకు ఓటెయ్యాలనుకునే వాళ్ళు పొద్దున్నే 6 గంటలకు లైన్ లో నిల్చోని కారు గుర్తు మీద నొక్కాలి. రోడ్ రోలర్ కు, చపాతీ మేకర్ కు ఓట్లు పోతాయని రేవంత్ రెడ్డికి దింపుడు కళ్ల ఆశ. సునీతమ్మ ఫోటోతో కారు గుర్తుకు మూడో నెంబర్ మీద ఓటు వేయండి. ఓటుకు 5వేలు ఇవ్వడం కాదు మహాలక్ష్మి కింద చెప్పినట్టు నెలకు 2,500 చొప్పున రెండేళ్లకు 60 వేల రూపాయలు ప్రతి మహిళకు ఇవ్వాలి.

నేను అంబేద్కర్ బస్తీ వాసులకు మాటిస్తున్నా. మీరందరూ సునీతమ్మని గెలిపించండి. ఏ బుల్డోజర్ వస్తుందో నేను చూస్తా. ఒక సీటీ కొడితే పావు గంటలో వచ్చి బుల్డోజర్ కి అడ్డంగా నేను నిల్చుంటా. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే బుల్డోజర్ ఉండదు. కాంగ్రెస్ ఉండదు. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరని అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి. కాంగ్రెస్ కంటే ముందు ముస్లింలు ఉన్నారు. కాంగ్రెస్ ఖతమైన తర్వాత కూడా ముస్లింలు ఉంటారు. రేవంత్ రెడ్డికి ముస్లిం సోదరులు ఓటుతో సమాధానం చెప్పాలి” అని హరీశ్ రావు పిలుపునిచ్చారు.

Also Read: రూ.4వేల పెన్షన్, మహిళలకు రూ.2,500..! ఎప్పటి నుంచి అంటే.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..