Ktr On Janwada Farm House : జన్వాడలో తనకు ఫామ్ హౌస్ ఉందంటూ వచ్చిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తన పేరు మీద ఎక్కడా ఫామ్ హౌస్ లేదన్నారాయన. జన్వాడలో తెలిసిన మిత్రుడి ఫామ్ హౌస్ ను లీజ్ కు మాత్రమే తీసుకున్నానని కేటీఆర్ చెప్పారు. అది బఫర్ జోన్ లో ఉంటే తానే దగ్గరుండి మరీ కూలగొట్టిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. అక్కడ చాలామంది కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ లు కూడా ఉన్నాయని తెలిపారు కేటీఆర్.
”నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు. స్పష్టంగా చెబుతున్నా. నా మిత్రుడికి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజుకి తీసుకున్న మాట వాస్తవమే. ఏడు నెలల నుంచి లీజ్ మీద ఉన్న మాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్ టీలో కానీ బఫర్ జోన్ లో కానీ ఉంటే.. నా మిత్రుడికి నేను చెబుతా.. అవసరమైతే నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే. ఆ ఫామ్ హౌస్ బఫర్ జోన్ లో కానీ ఎఫ్ టీలో కానీ ఉంటే నేను దగ్గరుండి కూలగొట్టిస్తా. అక్కడ చాలా మంది కాంగ్రెస్ నేతనలక ఫామ్ హౌస్ లు ఉన్నాయి. పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కేవీపీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు అక్కడ ఫామ్ హౌస్ లు ఉన్నాయి” అని కేటీఆర్ ఆరోపించారు.
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన హైడ్రా అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ పై దృష్టి సారించారు. జన్వాడ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దే అనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. తన పేరు మీద ఎక్కడా, ఎలాంటి ఫామ్ హౌస్ లేదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. జన్వాడలో తన మిత్రుడికి ఉన్న ఫామ్ హౌస్ ను తాను లీజుకు తీసుకున్నానని, అప్పుడప్పుడు అక్కడ ఉంటున్నానని కేటీఆర్ వివరించారు.
ఒకవేళ తన మిత్రుడు ఆ ఫామ్ హౌస్ ను నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించినట్లు రుజువైతే కచ్చితంగా తానే దగ్గరుండి ఆ ఫామ్ హౌస్ ను కూలగొట్టిస్తానని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో ఉన్న అన్ని నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తే మంచిదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తాను లీజుకు తీసుకున్న ఫామ్ హౌస్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కనుక.. మిగతా నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Also Read : మహిళా కమిషన్ వర్సెస్ కాంగ్రెస్ నేత..! చిచ్చు రాజేసిన వేణుస్వామి వ్యవహారం..!
జన్వాడలో తన మిత్రుడి ఫామ్ హౌస్ నిబంధనలకు అనుగుణంగానే ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చన్నారు. అక్కడే ఉన్న మిగతా నిర్మాణాలు కూడా అక్రమం అని తేలితే వాటిని కూడా కూలగొట్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేటీఆర్. గత కొన్ని రోజులుగా కేటీఆర్ ఫామ్ హౌస్ అంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనిపై తీవ్రంగా స్పందించిన కేటీఆర్.. ఆ ఫామ్ హౌస్ తనది కాదని తేల్చి చెప్పారు.