×
Ad

KTR On Hydraa: పేదల ఇళ్లే కూలుస్తారా? పెద్దోళ్ల జోలికి వెళ్లరా? హైడ్రాపై నిప్పులు చెరిగిన కేటీఆర్..

కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం జరుగుతోందన్నారు.

KTR On Hydraa: రాష్ట్రంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవస్థ హైడ్రా. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు ఎక్కడైనా కబ్జా చేసినట్లు తెలిస్తే వెంటనే హైడ్రా రంగంలోకి దిగిపోతుంది. అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని కూల్చేస్తోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాలు పరిరక్షణకు చర్యలు చేపడుతోంది. అయితే, హైడ్రా వ్యవస్థ రాజకీయ రంగు పులుముకుంది. హైడ్రా తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహంగా ఉంది. ఆ వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది.

హైడ్రాపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైడ్రా అనేది పేదల పాలిట శాపంగా మారిందన్నారు. హైడ్రా బాధితులతో సమావేశమైన కేటీఆర్.. హైడ్రాపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం జరుగుతోందన్నారు. నగరంలో పేదల ఇళ్లను మాత్రమే కూల్చేస్తున్న హైడ్రా.. పెద్దోళ్ల ఇళ్ల జోలికి ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. మరో 500 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని కేటీఆర్ అన్నారు.

”నిజంగానే కాంగ్రెస్ ది ప్రజాపాలనే అయితే, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, చిన్న పెద్ద అనే తేడా లేకపోతే.. పెద్దోళ్లను ఎందుకు ముట్టలేదు? పెద్ద వాళ్లకు ఎందుకు శిక్ష వేయలేదు? కనీసం వారికి నోటీసులు ఎందుకివ్వలేదు? భట్టి విక్రమార్క కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ దీనికి సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? హైడ్రా చేసేది మంచే అయితే, వాళ్లు నిజంగానే సమాధానం చెప్పగలుగుతారా? అక్కడ ఎవరూ పేదలు లేరని, పేద వాళ్లవి కూలగొట్టలేదని సిగ్గు లేకుండా చెబుతున్నారు.

పేదలకు ఒక నీతి, పెద్దోళ్లకు ఒక నీతా? కాగితాలు ఉండగా, కోర్టు ఆర్డర్లు ఉండగా ఎలా కూలగొడుతున్నారు? టైమ్ ఇస్తే కోర్టుకెళ్లి స్టేలు తెచ్చుకుంటారు, అందుకే టైమ్ ఇవ్వకుండా కూలగొడుతున్నామని మాట్లాడుతున్నారు. హైడ్రాను కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ టూల్ లా వాడుతోంది. పేదలకు కానీ, ప్రజలకు కానీ ఏ విధమైన లాభం జరగలేదు. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. మంచి పనులు చేస్తే మేమెందుకు వ్యతిరేకిస్తాం? ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. కొందరు బడా బిల్డర్లకి ఒక రూల్, పేదలకు ఒక రూల్. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఒక్క నిర్మాణం కూడా జరగలేదు. వేల సంఖ్యలో పేదల ఇళ్లను కూల్చేశారు” అంటూ హైడ్రా, కాంగ్రెస్ సర్కార్ పై ఫైర్ అయ్యారు కేటీఆర్.

Also Read: బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి ఘటన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్.. సంచలన కామెంట్స్..