KTR: ఆ 10మంది రాజీనామా చేయక తప్పదు.. 9 నెలల్లో ఎన్నికలు – కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల్లో చూసుకుందాం.. ఎవరి సత్తా ఏంటో తేలుతుందన్నారు.

KTR: గద్వాల గర్జన సభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పదన్నారు. 6 నుంచి 9 నెలల్లో గద్వాలకు ఎన్నికలు రాబోతున్నాయని కేటీఆర్ చెప్పారు. దమ్ముంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో చూసుకుందాం.. ఎవరి సత్తా ఏంటో తేలుతుందన్నారు.

కాంగ్రెస్ నేతలు యూరియాను బ్లాక్ లో అమ్ముకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఎవరి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లారని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ యూరియా కష్టాలు, కరెంటు కోతలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు కేటీఆర్. 20 లక్షల దళితబంధు హామీ ఏమైందని రేవంత్ సర్కార్ ను కేటీఆర్ నిలదీశారు. ఆడబిడ్డలకు స్కూటీ ఎక్కడిచ్చారని ప్రశ్నించారు.

”రైతులు యూరియా దొరక్క అల్లాడిపోతున్నారు. గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకుని రూ.1700 కోట్లు దండుకున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారు. నమ్ముకున్న ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచింది. గద్వాలను అభివృద్ధి చేసింది కేసీఆరే. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్ గా ఉంది. పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పదు” అని కేటీఆర్ అన్నారు.

”తెలంగాణ ఉద్యమంలోనూ గద్వాల ముందు వరుసలో ఉంది. గద్వాలను జిల్లా కేంద్రంగా మార్చడంతో పాటు మెడికల్ కాలేజ్ తెచ్చాం. కరోనా సమయంలోనూ అన్ని పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్ ది. కరోనా సమయంలోనూ రైతుబంధు వేసిన ఘనత కేసీఆర్ ది. బంగారు పల్లెంలో పెట్టి ఇచ్చిన తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఆగం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. గద్వాల మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరాలి” అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Also Read: పౌరుషం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.. ముక్కు నేలకు రాసి కేసీఆర్‌ని కలవాలి.. కడియం శ్రీహరిపై రాజయ్య నిప్పులు