KTR – Bandi Sanjay: మీ ‘బేటీ బచావో’ కేవలం నినాదమేనా? బండి సంజయ్‌ని ఎప్పుడు బర్తరఫ్ చేస్తారు? – ప్రధానిని ప్రశ్నించిన కేటీఆర్

ఉన్నావ్ కేసులో చేసినట్లుగా, రాహుల్ గాంధీ గారు హైదరాబాద్‌ వచ్చి బాధితురాలికి, ఆమె కుటుంబానికి అండగా నిలబడతారా? లేక ఇది తెలంగాణ బాధితులకు వర్తించదా?

  • Updated on- May 9, 2026 / 10:45 PM IST

KTR – Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకుపైన నమోదైన పోక్సో కేసుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రధానితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. బాలిక పరిస్థితి, వారి కుటుంబంపై జరుగుతున్న వేధింపులపై తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్. మీ ‘బేటీ బచావో’ కేవలం ఒక నినాదమేనా? అని ప్రధానిని ప్రశ్నించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై మీరు ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? అని అడిగారు. లేదా బండికి ఎలాంటి చర్యలు లేకుండా మినహాయింపు ఉంటుందా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? లేదా మంత్రివర్గం నుండి ఎప్పుడు బర్తరఫ్ చేయబడతారు? అని క్వశ్చన్ చేశారు కేటీఆర్.

రాహుల్ గాంధీ గారు, తెలంగాణలో మీ పార్టీ ఎలాంటి ‘జంగిల్ రాజ్’ నడుపుతోంది? అని ప్రశ్నించారు. ఒక మైనర్ బాలిక అన్ని ఆధారాలతో వచ్చినప్పుడు పోలీస్ శాఖ అత్యంత వేగంగా ఎందుకు స్పందించ లేదు? అని నిలదీశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఇతర POCSO నేరస్తుల మాదిరిగానే కేసు నమోదు చేసి ఎందుకు విచారణ జరపడం లేదు? మైనర్ బాలికపైనే ఎదురు కేసు ఎందుకు పెట్టారు? అని ప్రశ్నలు సంధించారు.

”ఉన్నావ్ కేసులో చేసినట్లుగా, రాహుల్ గాంధీ గారు హైదరాబాద్‌ వచ్చి బాధితురాలికి, ఆమె కుటుంబానికి అండగా నిలబడతారా? లేక ఇది తెలంగాణ బాధితులకు వర్తించదా? తెలంగాణ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి ఒక ఫ్రాంచైజీలా పని చేస్తోందా? ఒక మైనర్ బాలిక గౌరవం విషయంలో కాంగ్రెస్ , బీజేపీ ఒక అపవిత్రమైన, అసహ్యకరమైన ఒప్పందానికి వచ్చాయా? 17 ఏళ్ల అత్యాచార బాధితురాలు, ఆమె కుటుంబం, ఒక FIR నమోదు చేయించుకోవడానికే 3 నెలలకు పైగా ఎందుకు పోరాడాల్సి వస్తోంది? మనం ఎంతటి దుర్భరమైన, భయంకరమైన నరకంలో జీవిస్తున్నామో ఆ కుటుంబం కష్టం చూస్తే అర్థమవుతుంది.

బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని నేరస్తుల్లా చూస్తూ ఎందుకు వేధిస్తున్నారు? ఆ మైనర్ బాలిక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసింది! న్యాయం కోసం మూడు నెలలుగా తిరుగుతున్నారు. ఇప్పుడు మీరు ఆమెనే నిందిస్తున్నారా? ఏ నిబంధన ప్రకారం తెలంగాణ పోలీసులు ఒక మైనర్ బాలికపై హనీ-ట్రాప్ , వసూళ్ల కేసు నమోదు చేశారు? మన మహిళల గౌరవం కోసం గతంలో అణచివేతదారులతో, ప్రభుత్వాలతో పోరాడాం. ఆడబిడ్డల రక్షణ కోసం అవసరమైతే మరో మిలియన్ సార్లు మళ్ళీ పోరాడుతాం” అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

Also Read: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు..