KTR: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తిట్ల పురాణం తప్ప రేవంత్ చేసిందేమీ లేదంటూ ఎదురు దాడికి దిగారు. మీరు మాట్లాడే భాష మాకూ వస్తుందన్నారు. కానీ, ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం ఇచ్చి మౌనంగా ఉంటున్నామన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ అనవసర శపథాలు మానుకోవాలన్నారు. రేవంత్ ఎలా ఎదిగారో అందరికీ తెలుసన్నారు కేటీఆర్. ఇచ్చిన హామీలు అమలు చేస్తానని రేవంత్ శపథం చేయాలన్నారు. కాంగ్రెస్ కు ఓట్లేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గ్రామాల్లో మార్పు మొదలైందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే విషయంలో స్పీకర్ కళ్లుండి చూడలేని ధృతరాష్ట్రునిలా మారారని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే కాంగ్రెస్ నేతలకు చలి జ్వరం వచ్చిందన్నారు. అలాంటిది ఇక కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తే రేవంత్ గుండె ఆగిపోతుందన్నారు. నేను గుంటూరులో చదివితే తప్పేంటి అని కేటీఆర్ ప్రశ్నించారు. నేను ఆంధ్రాలో చదివితే తప్పంటున్నారు.. రేవంత్ మాత్రం ఆంధ్రా అల్లుడిని తెచ్చుకున్నారు అని విమర్శించారు. అమెరికాలో ఎవరి పని వాళ్లే చేసుకుంటారు, నేను కూడా అదే చేశానన్నారు. నేనేమీ దొంగ పనులు చేయలేదు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మొనగాడు కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. నేను మా నాన్న పేరు చెప్పుకుంటే తప్పేంటి అని సీఎం రేవంత్ పై ధ్వజమెత్తారు.
”కాంగ్రెస్ పరిపాలనలో ఈ రెండేళ్లలో ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప సాధించింది ఏమీ లేదు. ఎగవేతల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు మార్చుకోవాలి. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు. పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తానన్నాడు. సోనియా గాంధీ మీద ఒట్టు అన్నాడు. ఆడపిల్లలకు నెలకు రెండున్నర వేలు ఇస్తానన్నాడు. ప్రియాంక గాంధీ మీద ఒట్టు అన్నాడు. మరి ఎవరికైనా వచ్చాయా? రెండున్నర వేలు, తులం బంగారం వచ్చిందా? ముసలోళ్లను ముంచాడు. 2వేల పెన్షన్ ను 4వేలు చేస్తానన్నాడు. వచ్చాయా? ఇవేమీ కాలేదు కానీ.. ఇప్పుడు కోటి మంది ఆడోళ్లకు కోటి చీరలు ఇస్తాడంట.. తెలంగాణలో రెండు కోట్ల మంది ఆడపిల్లలు ఉంటే అందులో కోటి మందిని కోటీశ్వరులను చేసేదాకా విడిచిపెట్టడట. ఎలా ఉందంటే.. నెలకు రెండున్నర వేలు ఇవ్వడానికి ముఖం లేని వ్యక్తి కానీ కోటి మంది ఆడపిల్లలను కోటీశ్వరులను చేస్తానంటున్నాడు. కోటి మందిని కోటీశ్వరులను చేయాలంటే ఎన్ని కోట్లు కావాలో తెలుసా. కోటి కోట్లు కావాలి. మన బడ్జెట్ 3 లక్షల కోట్లు. ఎన్ని రోజులు కావాలి మరి. మీరు నేను బతికుంటామా” అని కేటీఆర్ అన్నారు.