Balka Suman: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొన్నారు. పలు అంశాలపై స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ కవిత చేస్తున్న వ్యాఖ్యలపై బాల్క సుమన్ స్పందించారు. కవిత విషయంలో బీఆర్ఎస్ నిర్ణయం ఏంటో బాల్క సుమాన్ చెప్పారు.
”కవితకు సంబంధించి మా పార్టీ ఒక నిర్ణయం తీసేసుకుంది. కవిత ఏం మాట్లాడినా ఏం చేసినా పెద్దగా పట్టించుకోకుండా ప్రజల పక్షాన మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. కవిత ఏం మాట్లాడినా పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు. రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ను ప్రజలు చూస్తున్నారు. రాజకీయ పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయచ్చు. పోటీ చేసినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు.
ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజలు మమ్మల్ని చూస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ఫలితాలు అలానే వచ్చాయి. కాబట్టి మేమే ప్రత్యామ్నాయం, రేపు అధికారంలోకి రాబోయేది మేమే. అటువంటి పరిస్థితుల్లో ప్రతి అంశానికి రియాక్ట్ అవడం ఎందుకు? కవిత పార్టీ పెట్టిన తర్వాత నేను పూర్తిగా మాట్లాడతా. బీసీలకు ఎవరు న్యాయం చేశారో, ఎవరు అన్యాయం చేశారో ప్రజల ముందు ఉంది. ప్రతి అంశంపై మేము రియాక్ట్ అయ్యాం, మాట్లాడం, కొట్లాడం.. ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో మా గొంతు వినిపించాము” అని బాల్క సుమన్ అన్నారు.