Duvvuri Subbarao : అనర్ధమే..! దేశంలో ఉచితాలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కీలక వ్యాఖ్యలు

దేశం ఆర్థికంగా చితికిపోయిన దశలో సుబ్బారావు.. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు.

Duvvuri Subbarao : రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు.. జస్ట్ ఏ మెర్సినర్సీ పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరించారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో పుస్తకావిష్కరణ జరిగింది. దేశం ఆర్థికంగా చితికిపోయిన దశలో సుబ్బారావు.. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. తనదైన నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కృషి చేశారు. కాగా, దేశంలో ఉచితాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉచితాలు పరిమితి మేరకు ఉండాలని సూచించారు. లేదంటే అనర్ధాలు తప్పవని హెచ్చరించారు.

”ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి దిగిపోయిన మూడేళ్లకు రిజర్వ్ బ్యాంకు అనుభవాల గురించి ఒక పుస్తకం రాశాను. ఆ బుక్ చదివిన చాలా మంది ముఖ్యంగా యువత.. మీ ఆర్బీఐ అనుభవాల గురించి రాశారు. కానీ, మీ 35ఏళ్లు ఐఏఎస్ గా కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంకులోనూ పని చేశారు. దాని గురించి కూడా రాయకూడదా అని అడిగారు. నాకు రాయాలని అనిపించినా కొన్ని సందేహాలు వచ్చాయి. రాయగలనా? లేదా? అని అనుకున్నారు. పాత కాలం విషయాలు యువతకు ఆసక్తికరంగా ఉంటాయా? అనే సందేహం కలిగింది. కానీ, వాళ్లు నన్ను ప్రోత్సహించారు. దాంతో ఈ పుస్తకం రాశాను. 35ఏళ్లు ఐఏఎస్ ఆఫీసర్ గా నా అనుభవం, సబ్ కలెక్టర్ గా పని చేసిన నాటి విషయాలు, కేంద్రంలో ఫైనాన్స్ సెక్రటరీగా పని చేసిన విషయాలు ఈ పుస్తకంలో రాశాను.

మన లాంటి దేశంలో చాలా మంది పేదలు ఉన్నారు. ఉచితాలు ఇవ్వాల్సిందే తప్పదు. కానీ, దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఉచితాలు ఇస్తుంటే, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ఆ డబ్బు కోసం ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. అప్పులు చేసి ఉచితాలు ఇస్తున్నాయి. ఆ ఉచితాలు వల్ల కొంతమందికి మేలు జరుగుతోంది. కానీ, ఆ అప్పు తీర్చాలి. అప్పు తీర్చాలి అంటే ఆ బరువు, బాధ్యత తర్వాతి తరాల వారిపై పడుతుంది. ఇప్పుడు పన్నులు, అప్పులు ఎత్తేసి ప్రజలకు ఉచితాలు ఇస్తూ పోతే.. తర్వాత ముందు ముందు ఈ అప్పులు ఎలా తీరుస్తాం? ఇది పూర్తిగా రాజకీయ అంశం. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఉచితాల విషయంలో ఒక ఒప్పందానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని దువ్వూరి సుబ్బారావు తేల్చి చెప్పారు.

Also Read : పార్టీల ఉచిత హామీలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పంచ్ డైలాగులు

 

ట్రెండింగ్ వార్తలు