ఎమ్మెల్సీ ఫలితాల ఉత్కంఠ.. ముందంజలో టీఆర్ఎస్.. రెండవ స్థానంలో మల్లన్న

Excitement In Telangana Mlc Elections1

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల సరళి ఉత్కంఠ రేపుతోంది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌‌తో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతోంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో తొలి రౌండ్‌ ఫలితాలు వెలువడగా.. 16,130 ఓట్లతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న12 వేల 46 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. 9 వేల 80 ఓట్లతో కోదండరామ్ మూడో స్థానంలో‌, 6 వేల 615 ఓట్లతో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డి నాలుగో స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌ 4 వేల 354 ఓట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గంలో బ్యాలెట్‌ ఓట్లను కట్టడం రాత్రి పది గంటలకు పూర్తి చేశారు. 799 పోలింగ్‌ కేంద్రాల్లోని బ్యాలెట్‌ పత్రాలను 8 హాళ్లలో 56 టేబుళ్ల వద్ద లెక్కిస్తున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య టఫ్‌ ఫైట్‌ కొనసాగుతోంది. మొదటి స్థానంలో సురభీ వాణీదేవి ఉండగా.. రెండో స్థానంలో రామచందర్‌ రావు, మూడో స్థానంలో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, నాల్గో స్థానంలో చిన్నారెడ్డి కొనసాగుతున్నారు. తొలి రౌండ్‌ పూర్తయ్యేసరికి టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణిదేవికి 22 వేల ఓట్లు, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావు 18 వేల ఓట్లు, ఇండిపెండెంట్‌ అభ్యర్థి నాగేశ్వర్‌కు 6 వేల ఓట్లు వచ్చాయి.

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో కొనసాగుతుండగా, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు నల్గొండలో కొనసాగుతోంది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థానం నుంచి 93 మంది, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గం నుంచి 71 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ నింపాదిగా కొనసాగుతోంది. మొత్తం ఏడు రౌండ్లలో ఓట్లు లెక్కించాల్సి ఉంది. నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానం ఫలితం ఇవాళ మధ్యాహ్నానికి పూర్తి కావొచ్చన్న అంచనాలున్నాయి. మొత్తం 731 పోలింగ్‌ కేంద్రాల్లోని బ్యాలెట్‌ పత్రాలను ఎనిమిది హాళ్లలో 56 టేబుళ్లపై లెక్కిస్తున్నారు. ఒక్కో రౌండ్‌లో 56 వేల ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లా గార్లలోని 175వ నంబరు పోలింగ్‌ బూత్‌లో 603 ఓట్లు పోలైతే అందులో 31 ఓట్లు తక్కువగా ఉన్నాయంటూ ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లు రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో మరోసారి బ్యాలెట్‌ పత్రాలను పరిశీలిస్తామని ఆర్వో హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక పోలింగ్‌ కేంద్రం బ్యాలెట్‌ బాక్స్‌లో ఒక బ్యాలెట్‌ ఎక్కువగా వచ్చిందని ఏజెంట్లు ఫిర్యాదు చేయగా అధికారులు పరిశీలించనున్నట్లు తెలిపారు.