HIGH COURT (1)
Kamareddy Master Plan : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులు న్యాయపోరాటానికి దిగారు. మాస్టర్ ప్లాన్ పై కామారెడ్డి రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రైతులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వర్ పల్లి రైతులు కోర్టులో రిట్ దాఖలు వేశారు. మాస్టర్ ప్లాన్ పై రైతులు తమ తమ అభ్యంతరాలను పిటిషన్ లో ప్రస్తావించారు. తమను సంప్రదించకుండా భూములను రీక్రియేషన్ జోన్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. అవసరమైతే సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు కూడా సిద్ధమని రైతులు స్పష్టం చేశారు.
కామారెడ్డి రైతులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై సోమవారం హైకోర్టు విచారణ జరుపనుంది.
గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. మాస్టర్ ప్లాన్ తో భూములు కోల్పోతున్నామంటూ రైతులు ఆందోళన చేపట్టారు. మాస్టర్ ప్లాన్ ను ఉపసంహరించుకోవాలని ఆందోళన చేస్తున్న రైతులు.. కలెక్టరేట్ గేట్ తాళం పగలగొట్టి లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అధికారులు వేసిన తాళం పగలగొట్టి రైతులు కలెక్టరేట్ లోనికి వెళ్లారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఈ సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే పోలీసులు ఎంతగా ఆపేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గని రైతులు గేట్ తాళం పగలగొట్టి కలెక్టరేట్ లోకి వెళ్లారు. రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. లోపలికి వెళ్తున్న కొంత మంది రైతులను పోలీసులు అడ్డుకుని వారిపై పడి గుద్దులు కురిపించినట్లు రైతులు చెప్పారు. అలాగే రైతులు లోపలికి వెళ్లకుండా పోలీసులు ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. తోపులాటలో పలువురు రైతులకు గాయాలు అయ్యాయి. స్వామి అనే రైతు స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతన్ని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. రైతులు రాత్రి వరకు ఆందోళన చేపట్టి అనంతరం విరమించారు.