Hyderabad : కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం.. ఐదుగురు మృతి.. పలువురికి గాయాలు

హైదరాబాద్‌ (Hyderabad) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్ గోకులేనగర్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

Hyderabad

Hyderabad : హైదరాబాద్‌ (Hyderabad) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్ గోకులేనగర్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి.

కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతులకు గురికావడంతో.. స్థానికులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో విద్యుత్ తీగలు రథాన్ని తాకడంతో తొమ్మిది మంది విద్యుత్ షాక్ కు గురై కిందపడిపోయారు. అప్రమత్తమైన స్థానికులు వారికి ప్రాథమిక చికిత్స చేపట్టి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఐదుగురు మరణించారు.

మృతిచెందిన వారిలో కృష్ణ యాదవ్ (21), సురేశ్ యాదవ్ (34), శ్రీకాంత్ రెడ్డి (35), రుద్రవికాస్ (39), రాజేంద్ర రెడ్డి (45) ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన మరో నలుగురు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఉత్సాహంగా రథోత్సవంలో పాల్గొన్నవారు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

Also Read: Cloud Burst: జనాల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న క్లౌడ్ బాంబ్.. అసలేంటీ క్లౌడ్ బరస్ట్.. ఎందుకొస్తాయ్.. గుర్తించడం ఎలా?