Former Home Minister Nayani is no more : టీఆర్‌ఎస్ సీనియర్ నేత, తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి మృతి చెందారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2020, అక్టోబర్ 21వ తేదీ బుధవారం అర్థరాత్రి 12గంటల 25 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. దీంతో నాయిని కుటుంబం సభ్యులు, అభిమానులు విషాదంలో మునిగారు.
గత నెల 28న కరోనా సోకడంతో నాయిని నర్సింహ్మారెడ్డి బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చేరారు. కరోనా తగ్గిన తర్వాత మళ్లీ వెంటనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. న్యుమోనియా తలెత్తడంతో సిటీ న్యూరో సెంటర్ నుంచి నేరుగా అపోలో ఆస్పత్రిలో చేరారు.
చికిత్సలో భాగంగా ఆయనకు గుండె ఆపరేషన్ చేసి స్టంట్ వేశారు. అయినా ఆరోగ్యం బాగుపడకపోవడంతో వెంటిలేటర్‌పైనే చికిత్స అందించారు. రాత్రి నాయిని ఆరోగ్యం మరింత విషమించింది. ఈ నేపథ్యంలోనే అర్థరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.