KTR
KTR : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీకి గవర్నర్ నుంచి అనుమతి లభించింది. ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహణలో నిధుల దుర్వినియోగం కేసులో కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గవర్నర్ జిష్టుదేవ్ వర్మకు లేఖ రాసింది. అయితే, తాజాగా.. ఆ ఫైలుపై గవర్నర్ సంతకం పెట్టినట్లు తెలిసింది.
ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్ ఇప్పటికే నాలుగు సార్లు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన ఏ1గా ఉన్నారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌లో రూ.54.88 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. నిధుల దుర్వినియోగంకు సంబంధించి కేటీఆర్‌ను విచారణ జరపాలని ఏసీబీ నిర్ణయించింది. ఈ క్రమంలో అందుకోసం అనుమతి కోరుతూ గవర్నర్‌కు లేఖ రాసింది. 70రోజుల తరువాత ప్రస్తుతం కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఈ కేసులో ఏసీబీ తన దూకుడు పెంచనుంది.
త్వరలో కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేయనున్న ఏసీబీ.. విచారణ తరువాత చార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ కేసులో ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నారు. ఇప్పటికే అరవింద్ కుమార్ పై డీఓపీటీకి ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే.