revanth reddy-Seeta Dayakar Reddy
revanth reddy-Seetha Dayakar Reddy : తెలంగాణలో ఎన్నికల వేడి పీక్స్ కు చేరుకుంటోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు. కొన్ని స్థానాలు పెండింగ్ లో ఉన్నా దాదాపు అన్నింటిని ప్రకటించారు. దీంతో మిగిలిన పార్టీలు తమ పార్టీ నుంచి గెలుపు గుర్రాల కోసం కసరత్తులు చేస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్ధులను బట్టి తమ పార్టీ అభ్యర్థుల్ని..ఎవరిపై ఎవరిని పోటీకి నిలబెట్టాలి..? అనేదానిపై కసరత్తులు చేస్తున్నాయి. అదే క్రమంలో టికెట్ దక్కని నేతలు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. తమకు టికెట్ ఇచ్చే పార్టీలోకి జంప్ అవ్వాలని చూస్తున్నారు. ఎన్నికల దగ్గరపడుతున్న కొద్ది జంపింగ్ లు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. దీంట్లో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ లో టికెట్ దక్కని నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు.టికెట్ కోసం మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇతర పార్టీల్లో టికెట్ దక్కని వారు తమకు టికెట్ ఇచ్చే పార్టీల్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు.
Telangana Congress: బీజేపీలోని ఐదుగురు ముఖ్యనేతలపై ఫోకస్ పెట్టిన హస్తం పార్టీ!
ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇది కేవలం ప్రచారం కాదని పక్కాగా కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. దీంట్లో భాగంగానే సీత దయాకర్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చారు. సుదీర్ఘంగా చర్చించుకున్నారు.దీంతో ఇక కాంగ్రెస్ లో చేరిక నామ మాత్రం అని తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో పలు విషయాలు చర్చించిన సీతా దయాకర్ రెడ్డి ఇక త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. దీంతో గెలుపు గుర్రాల అన్వేషణలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మహబూబ్ నగర్ లో కొంత పట్టు దొరికినట్లు అయింది. ఆమె కాంగ్రెస్ లో చేరితే మాజీ టీడీపీ నేతలు ఇద్దరు హస్తం గూటికి చేరినట్లు అవుతుంది. రేవంత్ రెడ్డి కూడా టీడీపీనుంచి వచ్చిన విషయం తెలిసిందే. సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే పార్టీ బలోపేతమవుతుందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు.